Jump to content

పుట:ప్రబంధరత్నాకరము.pdf/10

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


హరితపవిత్రగోత్రుఁడగు నబ్బురిలింగన కూర్మిపుత్త్రి సు
స్థిరగుణధాత్రి చానమ నశేషశుభాంచితగాత్రి నుర్వరన్.

13


చ.

సతతము సజ్జనార్థిబుధసన్నుతులై విలసిల్లునట్టి దం
పతులకు నుద్భవించితిమి పంకజనాభు కృపాసమృద్ధిచే
ధృతి నమరాద్రితుల్యులగు తిమ్మయమల్లయలున్ సమున్నత
స్థితిఁ గవిమిత్రబాంధవవిధేయుఁడ జగ్గనమంత్రివర్యుఁడన్.

14


వ.

అందగ్రజుండు.

15


శా.

భారద్వాజనితాంతగోత్రుఁడని చెప్ప న్మించు [1]నాఁ దాడెపల్
సూరామాత్యుని పుత్త్రి నమ్మనను సంశోభాంగి నుద్వాహమై
సారోదారుఁడు తిమ్మమంత్రి గనియెన్ సత్పుత్త్రులన్ [2]వెంగనన్
గారామొప్పఁగఁ గొండమంత్రిమణి నా గంగయ్యచానార్యులన్.

16


వ.

తదనుజుండు.

17


తే.

లలి భరద్వాజగోత్రుఁడౌ వెలగలేటి
కొండనామాత్యశేఖరు కూర్మిపుత్త్రి
వసుధ రామాంబఁ బెండ్లియై వల్లమంత్రి
మదనసమమూర్తి సింగనామాత్యుఁ గనియె.

18


సీ.

శాశ్వతవిక్రమైశ్వర్యసంపదలందుఁ
              గపికేతు వృషకేతు గరుడకేతు
భుజబలకారుణ్యభూరిప్రతిజ్ఞుల
              బలరాము రఘురాముఁ బరశురాము
సత్కావ్యవితరణసౌందర్యములయందు
              బాణుఁ బన్నగబాణుఁ బ్రసవబాణు
ఘనతరమాన[3]సకాంతి పెన్నిధులందు
              రారాజు ద్విజరాజు రాజరాజు


తే.

సాటి సేయంగఁ దగు [4]సప్తజలధివేష్ఠి
తావనీచక్రరాజసభాంతరముల
రమ్యతరభాగ్యగుణశాలి రామప్రెగడ
మంత్రిగంగయవల్లనామాత్యువరుని.

19


వ.

తదనుసంభవుండు.

20


సీ.

శ్రీపెదపాటిపురీ[5]బాలగోపాల
              కృష్ణప్రసాదితశ్రీల వెలసి
ఘనవైష్ణవమతజ్ఞ కందాళ తిరుమలా
              చార్యకృపాకటాక్షమున నలరి

  1. క. నాదాడేపల్, నాదాతెపల్
  2. క. వెంగలిన్, వేంగనన్
  3. క. సత్కార
  4. ట. చతుర
  5. క. పాల