పుట:పూర్వకవుల శృంగారప్రబంధములు.pdf/251

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

"కవిసార్వభౌముఁ"డని సార్ధకబిరుదము గాంచిన శ్రీనాథుని కవిత్వముఁ గుచ్చి నేనిక్కడ వేఱుగాఁ జర్చింపవలసిన యవసరము లేదు. అయినఁ గవి దీని నెట్టి వయసున వ్రాసినాఁడో యాలోచింపవలసియున్నది. ఈతడు యౌవనదశను స్త్రీలోలుఁడై విచ్చలవిడి దిరిగెనని చెప్పుదురు. ఆకాలముననే వీథినాటకమునందలి పద్యములఁ జెప్పెననియు వాడుక, రసికాభిలాషము కూడ నప్పటిదే అయినచో నది "నూనూఁగు మీసాల నూత్నయౌవనమున" నే విరచింపఁబడియుండును. అయిన నొక్క బాధకమున్నది. 89వ పద్యమునఁ "గవిసార్వభౌముని" పదము వాడఁబడి యున్నది. ఈబిరుదము శృంగారనైషధము వ్రాసిన వెనకనే యీతనికి రాయలయొద్దఁ బాదుకొల్పబడినట్లు విందుము. ఈ పద్యము తరువాతఁ గలుపఁబడినదేమో!

రసికాభిలాషమున శ్రీనాథుడు తెచ్చిన కల్పనలను కొన్నిటిని బూర్వకవులలోఁ గొంద ఱిటీవల నుపయోగించిరి. అందుచేత వారిలోఁ గొందఱియొద్దనైన గ్రంథ ముండెనని తోఁచుచున్నది. ఎందఱు శ్రీనాథుని కల్పనల దొంగలించిరో, యెందఱికిఁ గ్రొత్తగా నాతని యూహలే తట్టినవో చదువరులే నిర్ణయించుటకు వానినిక్కడఁ జూపిం చుచున్నాను.

i కూచిమంచి తిమ్మకవిని నడివీథిలోఁ గౌగలించిన వృద్ధవేశ్య
"చ. చతురులలోన నెంతయును, జాణ వటంచును నేను కౌగలిం
       చితి, నిటుమాఱుమో మిడగఁ జెల్లునె యోరసికావతంస!"

యన్నప్పుడు

" అ
       ద్భుత మగునట్టి బంగరపు, బొంగరపుంగవఁ బోలు నీకుచ
       ద్వితయము ఱొమ్ము నాటి యల, వీఁపున దూసెనటంచుఁ జూచితిన్.”

అన్న ప్రతివచనముయొక్క సమయస్ఫూర్తి నెంతుముగదా! ఇందలి 29వ పద్యముఁ జూడుడు.

ii తాను బ్రక్కను జేరగా మొగముఁ ద్రిప్పి పన్నుండిన వేశ్యగూర్చి రామలింగఁ డన్న
"మ. వరబింబాధరముం బయోధరములు, న్వక్త్రాలకంబు ల్మనో
       హరలోలాక్షులు చూప కవ్వలిమొగం, బైనంత నే మాయె? నీ
       గురుభాస్వజ్జఘనంబుఁ గ్రొమ్ముడియు మాకుంజాలవే? గంగ క
       ద్దరి మే లిద్దరిఁ గీడునుం గలదె?, యుద్యద్రాజబింబాననా!"

అను పద్యమునందలి భావము దీనిలోని 40 వ పద్యములోనివే, ఇందు "సౌందర్యగంగాఝరి", యని చెప్పి యందుల కనుగుణ్యముగా భావమంతయు నడుపుట విశేషము.