పుట:పూర్వకవుల శృంగారప్రబంధములు.pdf/250

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పీఠిక

పూర్వకవీంద్రులచే రచింపఁబడిన గ్రంథము లింక నెన్ని యెన్ని యెక్కడ నెక్కడ నడఁగియున్నవో యెవరి కెఱుక! ఈ వైశాఖమాసమున మాబంధువులలో నొకరియింటనైన వివాహమునకు సింహాచలపుటడివారమునకుఁ బోయి యుండి యక్కడ నొక శ్రీవైష్ణవ గృహస్థునిం బ్రాఁతతాటియాకుఁల బొత్తములను దిరుగవేయుచుండ నాకు “రసికాభిలాషము” అను నీ చిన్నిపొత్తము లభించింది. కవి యెవరో తెలియక “వీథినాటకము" కూడ దీనితోఁ గలసి యున్నందున శ్రీనాథుఁడాయని యనుమానించి, కవితాశైలియుఁ గల్పనాప్రౌఢిమయు శృంగారరసవిస్తరతయు నాయనుమానమును బలపఱంపఁగాఁ జివరను జూచి, గద్యము లేక పోయినను దుదిపద్యము చక్రబంధమగుటఁబోల్చి, యందు “శృంగారశ్రీనాథ” యను పేరేర్పడుటచే శ్రీనాధుని గ్రంథమేయని సిద్ధాంతము చేసితిని. గ్రంథమంతయు సావకాశముగాఁ జదివిన వెనుక 38, 89, పద్యములవలన మిగిలిన కొంచెము సంశయమును నిర్మూలమైనది. శృంగారమన్న విషప్రాయముగాఁ జూడవలయునని చెప్పు నిప్పటియాంధ్రులకు శృంగారభూయిష్టమకు నీపుస్తకము రుచింపమి విదితమే. కావున దీనిని బ్రచురింపఁగూడదని మొదట నిశ్చయించినను, శ్రీనాథకవి యంతటివాని గ్రంథముల లోకమున వెల్లడిచేయుటకుఁ జేయకపోవుటకు నొకరి యిష్టము కాదని తలఁచి తుదకుఁ బ్రచురింప నిశ్చయించి విశాఖపట్టణమునందలి శ్రీశారదామకుట ముద్రాక్షరశాలాధికారులగు మ. రా.రా. విన్నకోట అప్పలనరసింహ శ్రేష్ఠిగారికి జూప వారు దానిని దామే ప్రచురింపఁ గోరి తీసికొనిరి. దీనిని నవీనకవియే యొకడు రచించి ప్రచురించినచో మిమర్శకు లెట్లు దూషించియుందురో దేవునికే తెలియును!

శ్రీనాథుని వీథినాటకము లోకమునఁ బ్రచురమయ్యు నీరసికాభిలాషము కానందులకుఁ గారణము లేకపోలేదు. ఇందుఁ గవి యుద్దేశించిన నాయిక గొప్పరాజులయింటి దనుట నిశ్చయము. 3వ పద్యమునందలి "యందని మ్రానిపండు" నను మాటయు, 49వ పద్యము నందలి 'భోగినీముదిత' ననుమాటయు దానికి నిదర్శనములు. శ్రీనాథునికి కోరిక తీఱినట్లు కాని తీఱు నను నాసయున్నట్లు కాని యెక్కడను గనఁబడదు. ఈమె యెవతెయో! యెక్కడిదో? కన్య కాదని 21 న పదమునదలి "పరకాంత నిన్ను" ననుమాటయు, జారచింత గలదని 19 వపద్యమునందలి "భుజంగుల పాలౌ", ననుమాటయు దెల్పుచున్నవి. రసికుఁడగు శ్రీనాథుని యభిలాష మేమయ్యనో?