పుట:పూర్వకవుల శృంగారప్రబంధములు.pdf/216

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


మ.

వలపుం దాతురు గాని, పూరుషులతో వాయెత్తి స్పష్టంబుగం
దెలుపంజూడరు స్త్రీలు, నాదువలపున్ నేనాపుకోలేక, ల
జ్జిలకుండన్ వెలిఁ బెట్టుకొంటి ననుచున్ సిగ్గయ్య, నెమ్మోమునిం
కిలలోఁ జూపఁగలేను, దాఁచుకొననిమ్మా నాథ నీగుండెపై.

15


ఉ.

కన్యనొ యన్యకామినినొ కావలెనంచుఁ దలంపఁ బోక, సా
మాన్యగ నెంచి ప్రాపకము మాటతలంపుము నిన్నుఁ దక్కనే
నన్యుల కంటకైన నరయన్ రతివేళనె వేశ్య నౌచు నిన్
ధన్యునిగా నొనర్తుఁ, గులనారు లెరుంగని యట్టినేర్పుతో.

16


మ.

నినుఁ జూడన్ వలెనంచు, వీలయినచో నీతోడ సంభాషణం
బు నొనర్పన్ వలెనంచు, వాకిటనె ఱేపున్మాపు నేఁ గాఁపురం
బొనరింపందొరకొంటి, మోహమున నోహో! సాహసం బెక్కు వా
యెను: నే నే చనుదెంచి, పైఁబడెదజుమ్మీ నీవు రాకుండినన్.

17


ఉ.

నిన్నుఁ గనంగ, నామనసు నిక్కముగా సెగపొంత వెన్నయౌ,
“వెన్నవలెం గరంగు నలవేణుల కౌఁగిటఁ జేర్చుటే సుఖం,”
బన్న వరూధినీవచన మారసి, నన్ వరియింపు, మట్లుగా
కున్నను, నామన స్సుడుకునో నవమన్మథ, మన్మథాగ్నిచే.

18


మ.

మగరాజా, బిగువేల? బ్రహ్మ భవదాత్మం జేసెనా యేమఱా
యిగ? నేనే మగవాడనై, మఱియు నీవేకాంతవై, నాపయిన్
మిగులన్ మోహముచేతఁ గ్రాఁగుచును నీమే నున్నచో నూర కీ
పగిదిన్ బెట్టొనరించి నీయుసురులన్ బాలౌటకుం జూతునే.

19


ఉ.

నమ్మక మైనదాన ప్రియనాయక, నాహృదయంబు నీకు నే
నమ్మెద రమ్ము నీదయకు, నయ్యది చాల ప్రియంబటంచు బే
రమ్మును బెట్టి నీవు కొసరం దొడఁగన్, పయిపెచ్చుగా మదం
గమ్ము నొసంగెదన్ వదలఁగా వల దింతటి చౌకబేరమున్.

20