పుట:పూర్వకవుల శృంగారప్రబంధములు.pdf/215

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


చ.

సరిగను, మోడిగాఁగ, సరసంబుగ, తేలికగాఁగ, నోరగా
చుఱుకుగ నన్నుఁ జూతు వల చూపులభాషను నే నెఱుంగ; పల్
తెఱవక, యించుకే తెఱచి లేఁతగ పూర్ణముగాఁగవిప్పి సుం
దరముగ నవ్వుచుందు, వలనవ్వులభాషను నాకు నేర్పరా.

9


శా.

నీ వెవ్వడవు, నే నెవర్తె? నహహా! నీమీద నీమాడ్క నా
భావం బేటికి నిల్వ, కల్వవిరికిన్ పద్మారిపైరీతి? యా
పూవుంబోలిక దూరపుంజెలిమియే పొందక నాకబ్బునో?
నీవున్ నేనును బూవుఁదావియు బలెన్ నెయ్యంబుమైనుందుమో.

10


చ.

ఒకరికి మెచ్చుగొల్పుసొగ, సొక్కరికంటికి నచ్చదోయి నా
యక భవదీయరూపము మదక్షులకుం బ్రియమైనయట్టి పో
లికగనె, నాదురూపమున లేని విలాసములేని నీదుకం
టికిఁ గనిపించుత, న్మరుఁడు నేర్పుమెయిన్ ఘటియించు మాయచే!

11


ఉ.

ఒక్కొకకాంత కొక్కొకప్రియం గనునంతకు లోకమంతయున్
నిక్కముగా నెడారివలెనే కనుపట్టును, కన్నదాదియున్
చక్కని నందనోపవని చందమునం గనుపట్టు, నీవు నా
దృక్కుల పడ్డయంతటనె, దిక్కులు పుష్పమయంబు లయ్యెరా.

12


ఉ.

ఓరమణుండ, స్త్రీపురుషు లొండొరులన్ సమవాంఛ నేలఁగాఁ
బో "రది జన్మవాససయె పో” యని పెద్దలు పల్కలేదె! తా
గోరిన పూరుషుండు తనుఁగోరుటకంటెను భాగ్యమున్నె? నిన్
గోరితి, నీవు నాకు ననుకూలుడఁ వౌదువొ, లేదొ, యక్కటా!

13


చ.

వల పెద లేనియట్టి మగవానిపయిన్ మనసుంచి, వానితోఁ
గలయఁగ గోరుకంటె నరకం బిక స్త్రీలకు వేఱెకల్గునే?
తెలియని నీపయిన్ నిలిపితిన్ మది, నీవయి నీదుచిత్తమో
చెలువుఁడ నాదుభాగ్య మిదె చేతులు మోడ్చితి యేలుమా ననున్.

14