Jump to content

పుట:పాలస్తీనా-నార్ల-వెంకటేశ్వరరావు.pdf/31

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రక్షణవున్నా—ప్రాణాపాయం తప్పదు" అని హెచ్చరించాడు. ఈ సంగతిని తక్కిన యూదీయ ప్రముఖులు కూడా ఎంత త్వరగా గ్రహిస్తే, వారికి అంత లాభం.

18

దీని పై సెక్షన్​కూ, దీనికీ మధ్య వ్వవధి షుమారు నెల రోజులు.[1] ఈ నెల వ్యవధి కారణంగా ఇంతకు పూర్వం రాసిన దానిలో ఒక్క అక్షరమైనా మార్చవలసిన అగత్యం కనబడలేదు.

పాలస్తీనా ఆరబ్బుల జాతీయ విప్లవం యధా ప్రకారంగా సాగుతూనే ఉంది. బ్రిటీష్ వారి దమన నీతిలో లేశమైనా మార్పు కలగలేదు. లండన్ సమావేశం వల్ల పాలస్తీనా సమస్య పరిష్కారం కాగలదని ఆశించడానికి అవకాశం స్వల్పమని రాసిన మాట కూడా నిజమైంది.

ఈ సమావేశంలో ఆరబ్బులు యూదుజాతివారి సరసను కూర్చోమన్నారు. ఇందువల్ల చిత్రమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. అందరు ప్రతినిధుల్ని ఒకచోట చేర్చడం, రౌండ్ టేబుల్ సమావేశం జరపడం, దీనికి ఛేంబర్లేన్ (బ్రిటీష్ ప్రధాని) ప్రారంభోత్సవాన్ని చెయ్యడం—ఇది మొదట నిర్ణీతమైన కార్యక్రమం. చివరికి అసలు రౌండ్ టేబుల్ సమావేశ ప్రయత్నమే మానుకుని, సమావేశపరిచి, రెండు చోట్లనూ బ్రిటీష్ ప్రధాని ప్రారంభోత్సవ తతంగాన్ని జరపవలసి వచ్చింది.

ఎంత ఒడుదుదుకుగా ఈ లండన్ సమావేశం ప్రారంభమైందో, అంత ఒడుదుకుగానే ఉంది దాని నడక కూడా. ఇటు ఆరబ్బులకూ, అటు యూదులకూ, వారుభయుల మధ్యవున్న బ్రిటీష్ వారికీ ఎక్కడా లంగరు అందడం లేదు.

పాలస్తీనా ఆరబ్బుల స్వాతంత్య్రోద్యమాన్ని అరికట్టడం అసాధ్యమని గ్రహించడం వల్లనేమి, పాలస్తీనా ఆరబ్బులతో రాజీపడకపోతే, చుట్టుప్రక్కల వున్న ఆరబ్బు రాజ్యాలతోనే కాకుండా పూర్తి మహమ్మదీయ ప్రపంచంతోనే విరోధం తెచ్చి పెట్టుకొనక తప్పదనే భయం వల్లనేమి, ప్రస్తుతపు అంతర్జాతీయ విషమ పరిస్థితుల వల్లనేమి, బ్రిటీష్ వారు ఎల్లాగైనా సరే రాజీపడాలని చూస్తున్నారు. అయితే, పాలస్తీనాను చెయ్యి జారిపోనివ్వడం వారికి సుతరామూ ఇష్టం లేదు. అంచేత, పైకి స్వాతంత్య్రాన్ని ఇచ్చినట్టు కనబడుతూ, నిజమైన రాజ్యాధికారాన్ని తమ గుప్పిటిలో పెట్టుకోవాలని వారు ఎత్తులు వేస్తున్నారు.

మన దేశం విషయంలో సైమన్ కమీషమ్, లండన్ రౌండ్ టేబుల్ సమావేశాలు, జాయింటు పార్లమెంటరీ కమిటీ—ఈ తతంగాన్ని అంతా జరిపి చివరికి స్వల్పమైన విషయాలలో ఏదో కొంత స్వాతంత్య్రాన్ని ఇస్తూ, ముఖ్యమైన విషయాలలో పూర్వం కంటే కూడా అధికంగా పర పరిపాలనను విధించే ఇండియా యాక్టును తయారు చేసినట్టే పాలస్తీనా విషయంలో కూడా నాటకాన్ని ఆడాలని బ్రిటీష్​వారు ప్రయత్నిస్తున్నారు.

  1. దీన్ని వ్రాస్తున్నది 1939 మార్చి 6వ తేదీ రాత్రి తొమ్మిది గంటలకు.