Jump to content

పుట:పాలస్తీనా-నార్ల-వెంకటేశ్వరరావు.pdf/30

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఈ విధంగా వివిధ రాజ్యాల ఆరబ్బు ప్రతినిధుల సహకారాన్ని కోరడం ప్రశంసా పాత్రంగానే ఉందిగాని, పాలస్తీనా జాతీయోద్యమానికి ప్రధాన నాయకుడైన గ్రాండ్ మఫ్తీని[1] ఆహ్వానించక పోవడంలో పెద్ద పొరపాటు చేశారు. ఇంతేకాదు. రాజకీయ ఖైదీల నందరిని విడుదల చెయ్యకపోవడం లోనూ, దమననీతిని విరమించక పోవడంలోనూ, గ్రాండ్ మఫ్తీ నాయకత్వం కిందవున్న ఆరబ్ హైయర్ కమిటీకి విరుద్ధంగా పాలస్తీనా డిఫెన్స్ పార్టీని లేవదీయించడంలోనూ ఇంకా అనేక పొరాపాట్లను చేశారు.

పాలస్తీనా సమస్యను నిజంగా పరిష్కరించాలంటే, బ్రిటీష్ వారు ఈ పొరపాట్లను చెయ్యవలసింది కాదు. పాలస్తీనా ఆరబ్బులు తమ కోర్కెల్ని ఇదివరకే స్పష్టపరిచారు. అవి ఇవి:

పాలస్తీనాను యూదు జాతీయ కేంద్రంగా చెయ్యాలనే ప్రయత్నాన్ని విరమించుకొని, బాల్ఫర్ ప్రకటనను రద్దుపరచాలి.

ఇకముందు యూదులను పాలస్తీనాకు వలసకు రానివ్వరాదు.

(బ్రిటీష్ మేండేట్​ను రద్దుపరచి ఇరాక్​తో చేసుకున్నట్టుగా ఒక సంధి చేసుకొని, పాలస్తీనాను స్వతంత్రమైన ఆరబ్బు రాజ్యంగా చెయ్యాలి.

ఈ కోర్కెల్ని బ్రిటన్ ఆమోదించకపోతే, లండన్​లో మరికొద్ది రోజులలోనే సమావేశం కానున్న పాలస్తీనా రౌండ్ టేబుల్ సభ విఫలం కాక తప్పదు. ఈజిప్టు, ఇరాక్ రాజ్యాల ప్రధాన మంత్రులు ఈ సభ జయప్రదం కాగలదనే విశ్వాసాన్ని ప్రకటిస్తున్నారు. ఈ లండన్ రౌండ్ టేబుల్ సభల అనుభవం పూర్తిగావున్న భారతీయులు ఈ ప్రకటనలోని ఆశలో భాగస్వాములు కాలేరు.

ఈ సందర్భంలో యూదు జాతివారు ఒక విషయాన్ని గమనించడం వారికే శ్రేయస్కరం. వారిని ఫేసిస్టు డిక్టేటర్లు పెడుతున్న ఘోరహింసలు ప్రపంచ హృదయాన్ని ద్రవీభూతం చేస్తున్నాయి. ఎక్కడనూ నిలవ నీడలేక అల్లాడుతూ ఉన్నవారి స్థితి నిజంగా దీనాతి దీనమైనదే! అయితే, ఆ కారణం చేత, వారు పాలస్తీనా ఆరబ్బులకు అన్యాయం చెయ్యడంగాని, పాలస్తీనాను యూదు రాజ్యంగా మార్చడం గాని సహించరాని పని. పూర్వ కాలంలో పాలస్తీనా యూదు జాతీయ కేంద్రం అయిన మాట నిజం. కాని, దాదాపు రెండువేల సంవత్సరాల నుంచి ఆరబ్బులు అక్కడ స్థిరనివాసం ఏర్పరచుకొని ఉన్నారు. తమకు యూరపియన్ జాతులవారు అన్యాయం చేస్తున్నారు గదా అని, యూదు జాతివారు ఆరబ్బులను దేషభ్రష్టుల్ని చెయ్యడం న్యాయమా?

హీబ్రూ యూనివర్సిటీ ప్రధానాధికారి అయిన జూడా మాగ్నెస్ "ఆరబ్బుల సమ్మతి లేకపోతే పాలస్తీనాలో ప్రస్తుతమున్న నాలుగు లక్షల యూదీయులకు—తాత్కాలికంగా బ్రిటీష్ సైన్యాల

  1. ఈయన ప్రస్తుతం సిరియాలో ప్రవాసిగా ఉన్నాడు.