ఆరబ్బు రాజ్యాల మధ్య—వాటి గుండెలో పొడవడానికి—బ్రిటిష్ ఇంపీరియలిస్టులు యూదురాజ్యాన్ని స్థాపించడానికి యత్నిస్తున్నారని ఆరబ్బులందరు సంక్షోభపడ్డారు.
అరేబియా పీఠభూమిలోనే కాకుండా, ఈజిప్టులోను, ఉత్తర ఆఫ్రికాలోను, హిందూ మహాసముద్ర తీరాలలోను ఆరబిక్ భాషను మాటాడేవారు దాదాపు నాలుగు కోట్ల మంది ఉన్నారు. వారున్నట్టి దేశాలు ఇవి: ఈజిప్టు, సిరియా, లెబ్నాన్, ఇరాక్, యెమెన్, పాలస్తీనా, ట్రాన్జోర్డాన్, సౌదీ అరేబియా, ఓమన్, లిబియా, టునీషియా, అల్జీరియా, ఫ్రెంచి మొరాకో, స్పానిష్ మొరాకో, ఇంకా మరికొన్ని చిన్నచిన్న రాష్ట్రాలు. వీటిలో ఈజిప్టు, ఇరాక్, సౌదీ అరేబియా, యెమెన్[1] స్వతంత్ర రాజ్యాలు. సిరియా, లెబ్నాన్ రాజ్యాలు—ఇంకా ఫ్రెంచివారి మేండేటరీ అధికారంలో నుంచి పూర్తిగా తప్పించుకొనకపోయినా—ప్రజా స్వామికాలు. పాలస్తీనా, ట్రాన్స్ జోర్డాన్ రాజ్యాలు బ్రిటన్ మేండేట్ కింద ఉన్నాయి. లిబియా, ఇటలీ పరిపాలన కింద ఉంది. టునీషియా, అల్జీరియా రాజ్యాలు ఫ్రాన్సుకు లోబడి ఉన్నాయి. ఇలా వివిధ రూపాల ప్రభుత్వం కింద—వివిధ ప్రభుత్వాల పరిపాలన కింద—ఉన్న ఆరబ్ జాతివారి నందరిని ఐక్యపరచి, ఒక ఆరబ్ మహారాజ్యాన్ని స్థాపించాలనే ఒక ఉద్యమం తలయెత్తింది. ఈ ఉద్యమానికి సిరియా జన్మస్థానం. అక్కడి నుంచి ఇది తక్కిన ఆరబ్ రాజ్యాలకు పాకింది.
ఈజిప్టు ప్రజలు ఆరబిక్ భాషనే మాటాడతారు. అయితే వారికీ, తక్కిన ఆరబ్బులకూ రక్త సంబంధం—జాతి సంబంధం—తక్కువ. అయినప్పటికీ సిరియా తర్వాత ఈజిప్టు. ఇటీవల ఆరబ్ జాతీయ సంఘటనోద్యమానికి ప్రధాన కేంద్రమైంది. వారం, పది రోజుల ఈ మధ్య—1938 జనవరి మధ్య భాగంలో—జరిగిన విషయాల్ని బట్టి చూస్తే, ఈజిప్టు రాజు ఫరూక్ ఈ మహోత్యమానికి నాయకుడయ్యేలా ఉన్నాడు.
ఆరబ్ జాతి ప్రజలనందరినీ ఐక్యపరిచి, ఒక ఆరబ్ మాహారాజ్యాన్ని సృష్టించాలని ఈవిధంగా ఒక ఉద్యమం తలయెత్తుతూ ఉన్న సమయంలోనే బ్రిటీష్ వారు పాలస్తీనాలోని ప్రధాన భాగాన్ని విడదీసి, అక్కడ ఒక యూదు రాజ్యాన్ని నిర్మించాలనే ప్రయత్నం (పీల్ కమీషన్ ద్వారా) చేశారు. ఈ ప్రయత్నాన్ని ఒక్క పాలస్తీనా ఆరబ్బులే కాకుండా, ఆరబ్బు జాతి వారందరూ తీవ్రంగా ప్రతిఘటించారు. దీన్ని చూడగా ఇస్లాం ప్రపంచం అంతా కూడా తమకు ప్రతికూలం అయిపోతుందేమోనని బ్రిటీష్ వారికి భయం తోచింది. ఆరబ్బులకు ఇటలీ, జర్మనీ రాజ్యాల తోడ్పాటు కూడా ఉన్నదనే బెదురుపుట్టింది. అంచేత వారు పాలస్తీనా విభజన ప్రయత్నాన్ని విరమించారు.
విరమించి, పాలస్తీనా సమస్యా పరిష్కారానికి లండన్లో ఒక రౌండ్ టేబుల్ సభను జరప నిశ్చయించారు. దీనికి వివిధ రాజ్యాల ఆరబ్బు ప్రతినిధుల్ని ఆహ్వానించారు.
- ↑ హెడ్ జాజ్కు దక్షిణంగా ఉంది.