కనబరచారు. దమననీతి ప్రారంభమైంది. అందుచేత బహిరంగ విప్లవానికి తల పడ్డారు. విప్లవంలో దౌర్జన్యాలు తప్పవుగదా!
బ్రిటన్ పైన విప్లవాన్ని చెయ్యడంలో ఫేసిష్టు ప్రభుత్వాలు ఆరబ్బులకు కొంతవరకు తోడ్పడుతున్నవి. ఇలా తోడ్పడ్డంలో వాటి ఉద్దేశం ఆరబ్బుల స్వాతంత్య్రానికి తోడ్పడ్డం కాదు; బ్రిటన్ చిక్కులలో పెట్టడమే. బ్రిటన్ స్థానంలో పాలస్తీనాను పరిపాలించడానికి వీలు చిక్కితే, ఇటలీగాని, జర్మనీగాని ఆ అవకాశాన్ని పోనియ్యవు. అవి బ్రిటన్ కంటే కూడా ఎక్కువ నిరంకుశంగా పరిపాలన సాగిస్తాయి కూడా. అయితే, ఇది బ్రిటన్ శాశ్వతంగా పాలస్తీనాను దాస్యంలో ఉంచడానికి "ఆర్గుమెంట్" కాదు; కాగుడదు. ఈ ఆర్గుమెంట్ బ్రిటిష్ ఇంపీరియలిజం ఎంత దుష్టమైనదో, ఫేసిజం కూడా అంత ఘోరమైనదని చెప్పడానికే!
ప్రస్తుతం జరుగుతున్న విప్లవ ప్రారంభంలో ముసోలినీ ఆరబ్బులకు పూర్తిగా సహాయం చేశాడు. ధనాన్ని ఇచ్చాడు. ఆయుధాల్ని పంపించాడు. విప్లవ ప్రచారాన్ని చేసిపెట్టాడు. బ్రిటన్ను దుయ్యబట్టడానికీ, పాలస్తీనా ఆరబ్బులనే కాకుండా మాహమ్మదీయ ప్రపంచాన్ని అంతటినీ కూడా తిరుగుబాటుకు పురికొల్పడానికి బారీ దీవులలో ప్రత్యేకంగా ఒక రేడియో స్టేషన్ కట్టించి, ప్రాచ్య భాషలలో బ్రాడ్ కాస్ట్ చేయించాడు. "ఇస్లాం సంరక్షకుడు" అని తనకు తానే ఒక బిరుదును తగిలించుకున్నాడు.
ప్రారంభంలో ఇంతచేసిన ముసోలినీ ఆంగ్లో—ఇటాలియన్ ఒడంబడిక తర్వాత, సర్దుకున్నాడు. అప్పటి నుంచి హిట్లర్ అందుకున్నాడు. అతడు ఆరబ్బులకు ఎంతగా సహాయం చేస్తున్నదీ ఈ కింది కథ వల్ల తెలుస్తుంది:
ఆరబ్బు విప్లవకారులు రోడ్ల మధ్య తుపాకి మందు గనిని పెడుతున్నారు. రోడ్డు పైకి మామూలుగానే ఉన్నది గదా అని ఏ మిలటరీ లారీయో దాని మీదగా వెడితే, ఆ గని పేలుతుంది; లారీలోనివారు దెబ్బతింటారు. ఇలాంటి అపాయాలు ఎక్కువ కావడాన్ని చూచి, బ్రిటిష్ అధికారులు ఒక ఎత్తువేశారు. అది ఏమంటే,—ఒక లారీలో తమ బందీలో ఉన్న ఆరబ్బు విప్లవకారుల్ని కూర్చోపెట్టడం; దాన్ని రోడ్డు మీద ముందు పంపించి, తమ లారీలను వెనక ఉంచడం. ఇందువల్ల రోడ్డు మధ్య గని ఉండి పేలితే, అది విద్రోహులు ఉన్నట్టి మొట్టమొదటి లారీ కిందనే పేలాలి. అప్పుడు తమ వారిని తమ చేతులతోనే చంపుకున్నట్టు అవుతుంది గదా అని విప్లవకారులు గనుల్ని పెట్టడం మానివేస్తారు. కొన్ని రోజులపాటు ఈ యెత్తు బాగానే పారింది. ఆ తర్వాత మొదటి లారీ కిందనే కాకుండా ఏలారీ కింద కావాలంటే, దాని కిందనే పేలేగనుల్ని ఆరబ్బులు పెట్ట నారంభించారు. గనుల్ని పెట్టడంలో వారు చూపిన ఈ కొత్త ప్రజ్ఞకు జర్మన్ ఇంజనీయర్లు కారణం అని అంటున్నారు. ఇది నిజమే కావచ్చును.