Jump to content

పుట:పాలస్తీనా-నార్ల-వెంకటేశ్వరరావు.pdf/25

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

జనవరి 12వ తేదీని యూదీయుడైన ఒక పహరా జవాను దగ్గర ఒక రివాల్వర్, నాలుగు కణికల డైనమైట్ దొరికింది. ఇందుకు అతడికి వేసిన శిక్ష—ఐదేళ్ళ ఖైదు!

ఆల్ట్​మన్ అనే యూదు పోలీసువాడు 1938 ఫిబ్రవరి 4వ తేదీని ఆరబ్ లారీ మీద తుపాకిని కాల్చినందుకు మిలిటరీ కోర్టు అతడికి ఉరిశిక్ష వేసింది. ఫిబ్రవరి 7వ తేదీని ఈ ఉరిశిక్షను ఆజన్మ కారాగార వాసానికి తగ్గించారు. ఇదే సమయంలో పదిహేడు సంవత్సరాల ఆరబ్బు బాలుడికి అతడి దగ్గిర మిల్సు బాంబు పట్టుబడిందని పది సంవత్సరాల కఠిన ఖైదు వేశారు.

పాలస్తీనాలో బ్రిటీష్ కోర్టులు దయచేస్తున్న న్యాయం ఇదే! ఇంతకు మించిన ఒక ఘోరం ఏమంటే,—యూదు పోలీసులకు తుపాకుల్ని ఇస్తున్నారు; అరబ్బు పోలీసులకు లాఠీలను మాత్రమే సప్లయ్ చేస్తున్నారు.

15

బ్రిటిష్ అధికారులు, వారిని చాటుచేసుకుని యూదు జాతీయులు ఎంత దౌర్జన్యానికి దిగినా ఆరబ్బు జాతీయవాదులు చెదిరిపోవడంలేదు. తమ ప్రతికక్షులు ఎక్కువ దౌష్ట్యాలను చేసినకొద్దీ ఆరబ్బులు ఎక్కువ ధైర్యసాహసాలను ప్రదర్శిస్తున్నారు. ఈసారితో ఈ దేశం మనది కావడమో, కాకపోవడమో తేలిపోవాలి అనే పట్టుదల వారు చూపుతున్నారు.

"ఆధునిక యుద్ధానికి కావలసిన సాధనాలు బొత్తిగా లేని ఈ చిన్ని తిరుగుబాటును బ్రిటిష్ ప్రభుత్వంవారు అణిచి వెయ్యలేరని అనుకోవడం హాస్యాస్పదం" అని పీల్​కమిషన్[1] తన నివేదికలో వ్రాసింది. ఈ వాక్యాన్ని వ్రాసిన తర్వాత సంవత్సరం పైగా గడచినా ఇప్పటికీ ఆరబ్బుల స్వాతంత్య్ర సమరం సాగుతూనే ఉంది. ఆరబ్బులకు ఆధునికమైన ఆయుధాలు లేకపోవచ్చును. కాని, వారి చేతులలో జాతీయత అనే వజ్రాయుధమున్నది. వారు చేస్తున్నది చిన్న తిరుగుబాటే కావచ్చును. కాని, బ్రిటన్ చేసే ప్రతి దౌర్జన్యంతోనూ ఆ తిరుగుబాటుకు కొత్తబలం వస్తున్నది.

ఆరబ్బు విప్లవకారులు చేసే సాహసకృత్యాలకు అంతులేదు; వారు ఎదుర్కొనే అపాయాలకు పారంలేదు.

తమకు కావలసిన డబ్బును వారు బ్రిటిష్ బ్యాంకుల నుంచి దోచుకుంటున్నారు; కావలసిన తుపాకుల్ని బ్రిటిష్ పోలీసు స్టేషన్ల నుంచి పట్టుకుపోతున్నారు. ఎక్కడి నుంచి ఎప్పుడు ఇచ్చి పడతారో తెలియదు. తిరిగి అంతలోనే ఎటు మాయమైపోతారో చెప్పలేము. కొన్ని చోట్ల పన్నుల్ని వసూలుచేసి, రసీదుల్ని ఇస్తున్నారు. మరికొన్ని చోట్ల కోర్టుల్ని పెట్టి, తీర్పుల్ని చెబుతున్నారు.

ఈ సందర్భాలలో వారు దౌర్జన్యాల్ని చేస్తున్నమాట నిజం. అయితే, వారి దౌర్జన్యాలు బ్రిటన్ దౌర్జన్యాలకు కేవలం బదులు. వారు న్యాయాన్ని కోరారు. న్యాయం లభించలేదు. అశాంతిని

  1. దీన్ని గురించిన వివరాలు పై ప్రకరణంలో.