ఇటలీ, జర్మనీలు తమకు సహాయాన్ని చేసినవిగదా అని ఆరబ్బులు ఫేసిజం వైపుకు మొగ్గితే మాత్రం వికాసం కోసం—విజృంభణ కోసం—పెనుగులాడుతున్న వారి జాతీయత పుట్టుకలోనే సంధి కొట్టిపోతుంది. ఉన్నతాశయాలతో బయల్దేరి, చివరికి బ్రిటిష్ ఇంపీరియలిస్టుల తాబేదారులై పోయిన జియోనిస్టుల వలె వారు కూడా గర్వనీయులౌతారు.
16
మొదట కొంతకాలం దమన నీతిని ప్రయోగించి, దాని వల్ల విప్లవం తగ్గనందున, ఇంకొక దారిని తొక్కుదామనే తలంపుతో బ్రిటన్ 1936 జూలైలో పాలస్తీనా సమస్యా పరిష్కారానికి తగిన సూచనలన్ని చెయ్యడానికి అంటూ, పీల్ ప్రభువు అధ్యక్షత క్రింద, ఒక రాయల్ కమీషన్ను నియమించింది. పరిస్థితులు శ్రుతిమించినప్పుడు బ్రిటన్ ఇలాంటి తతంగాన్ని చెయ్యడం పరిపాటి. కమిషన్ అనిగాని, కమిటీ అనిగాని, కాన్ఫరెన్స్ అనిగాని ఒకదాన్ని సృష్టిస్తే, అది చివరికి చెయ్యగల పని శూన్యమైనప్పటికీ, ఈ లోపుగా ప్రజాందోళనను కొంత వరకు అరికట్టి ఉంచవచ్చును. అయితే, ఈ యెత్తు ఆరబ్బులకు తెలియనిదికాదు. ఇంతకు పూర్వం ఆరు సార్లు ఈ కమిషన్ల తతంగం జరిగింది. అంచేత వారు పీల్ కమిషన్ను పూర్తిగా బహిష్కరించారు.
అయినప్పటికీ పీల్ కమిషన్ వారు పాలస్తీనా వెళ్ళి, కొన్ని నెలలపాటు అక్కడ పర్యటనం చేసి, తిరిగి ఇంటికి చేరుకుని, 1937 జూలైలో తమ నివేదికను ప్రకటించారు. ఈ నివేదికలో వారు సమస్యా పరిష్కారానికి సూచించిన మార్గం,—పాలస్తీనాను మూడు ముక్కలుగా పంచి, ఒక ముక్కను ఆరబ్బులకూ, ఒక ముక్క యూదులకూ ఇవ్వడం, మూడో దాన్ని బ్రిటన్ ఉంచుకోవడం.
అసలు పాలస్తీనాను మూడు భాగాల కింద విభజించాలనడం అన్యాయమైతే, ఇక ఆ మూడు భాగాల పరిమితి విషయమై పీల్ కమిషన్ వారు చేసిన సూచనలు కేవలం ఘోరమైనవని చెప్పాలి.
అన్ని పుణ్యక్షేత్రాలు, జాఫా మీద పూర్తి అధికారం, సైనిక దృష్టిలో ప్రధానమైన అన్ని ప్రదేశాలు,—ఇది బ్రిటన్ వాటా.
అన్నింటి కంటే సారవంతమైన పీఠభూమి, అన్ని రహదార్లు, అన్ని వాణిజ్య సౌకర్యాలు—ఇది యూదులవాటా.
మిగతా ఎడారి అంతా దానధర్మ విక్రయాది సర్వ హక్కులతో,—ఆరబ్బులవాటా.
పాలస్తీనాలో ఉన్న పుణ్యక్షేత్రాలు ఒక్క పాలస్తీనా వాసులకే కాక ప్రపంచం అంతటికీ సంబంధించినవి. అంచేత అవి బ్రిటన్ పరిపాలనలో ఉండడం ధర్మం. బ్రిటిష్ సామ్రాజ్య రక్షణకు జాఫా అవసరం. అంచేత దాని మీద బ్రిటన్కు హక్కు ఉండవలసిందే!