Jump to content

పుట:పాలస్తీనా-నార్ల-వెంకటేశ్వరరావు.pdf/23

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

"ఒక చెవిటి గొర్రెలకాపరిని 'ఎవడురా' అని పలకరిస్తే, వాడు బదులు చెప్పాడుకాదు. వెంటనే వాణ్ణి కాల్చిచంపారు.

"సంహనా అనే గ్రామంలో ముఖ్యంమైన వారినందరినీ చెరువు గట్టు మీదికి చేర్చి, మంచులా జిమ్ముమంటూ ఉన్న నీళ్లలోకి తోశారు. మిలిటరీవారు వెళ్ళిపోయిన తర్వాతగాని వాళ్ళను వొడ్డుకు చేర్చడానికి వీలుపడలేదు. ఆడవాళ్ళను రాళ్ళగంపల్ని మొయ్యమన్నారు. సరిగా మొయ్యలేకపోయిన వారిని రాళ్ళతో కొట్టారు.

"ఒకచోట ఆహారపదార్ధాల్ని, వస్త్రాభరణాల్ని దోచుకోవడమే కాకుండా, అక్కడి స్త్రీ పురుషులనందరిని సిగ్గు మాలిన పనులకు లోనుజేశారు. తర్వాత ఇరవై మందిని తాడుతో ఒక కారుకు కట్టి, హైస్పీడ్​తో వారిని ఈడ్చుకు వెళ్లారు.

"తాలిపార్​లో 150 మందిని గ్రామం చుట్టూ లెఖ్ఖ లేకుండా ప్రదక్షిణాలు చేయించారు. అలుపు వచ్చి పడిపోయిన వారిని కొరడాలతో క్రూరంగా కొట్టారు. కొందరు పారిపోవాలని చూస్తే, వారి మీద తుపాకుల్ని కాల్చారు. ఒకడు గాయపడ్డాడు. ఇంకొకడు పరుగెత్త లేక పట్టుబడ్డాడు. అతడిని చావ చితకగొట్టారు."

"ఘాన్​డాన్​లో ఇళ్ళను సోదా చూశారు. 35 మందిని (నలుగురు స్త్రీలతో సహా) గాయ పరిచారు.

"చాలా మంది ఉలేమాలను అరెస్టు చేశారు. అరెస్టు సమయంలో వారిని చాలా అవమానపరిచారు. కొందరిని రోజుకు మూడుసార్లు పోలీసుస్టేషనులో హాజరువేసిపొమ్మని ఆజ్ఞాపించారు.

"మూడు చోట్ల కొరానును చించి పారవేశారు.

"సర్వ కార్మికసమ్మె (జనరల్ స్ట్రయిక్) సమయంలో షేక్ అర్సలాన్ మసీదును డైనమైట్​తో పడగొట్టివేశారు."

గుండెల్ని జలదరింపజేసే ఈ వృత్తాంతాల్ని ప్రకటిస్తూ, "డక్కన్ టైమ్స్" ఇలా వ్రాసింది. "వీటినన్నింటిని మించిన ఘోరసంఘటనల్ని మేము ప్రకటించడంలేదు. కారణం సువిదితమే!"

14

బ్రిటిష్ అధికారులతోబాటు యూదీయులు కూడా ఆరబ్బులపట్ల రాక్షసత్వాన్ని ప్రదర్శిస్తున్నారు. ఒక ఆరబ్బీవాని ఇంటిని కూలదోస్తే, ఒక యూదీయునికి ఇల్లు కట్టుకోడానికి చోటు దొరుకుతుంది. పదిమంది ఆరబ్బుల కాలుచేతుల్ని విరిస్తే, పదిమంది యూదీయులకు కూలినాలి దొరుకుతుంది. వందమంది ఆరబ్బుల్ని చంపివేస్తే, వందమంది యూదీయులు వలస రావడానికి వీలుకలుగుతుంది. ఆరబ్బు జాతి ఎంత ఎక్కువగా నశిస్తే, దేశం అంత సులభంగా యూదుజాతి వశమౌతుంది. ఈ సూత్రం మీద వారు నడుచుకుంటున్నారు. వారు చేస్తున్న ఘోరకృత్యాల్ని గురించి ఒక జర్మన్ పత్రిక ఇలా వ్రాసింది: