తప్పక కాల్చివేస్తారు. అయినా, ధైర్యం చెడక, వారు ఉద్యోగ ధర్మాన్ని నిర్వహిస్తున్నారు. ప్రాణాలకు కూడా తెగించి ఇలా ప్రభుత్వానికి సేవ చేసి, సాయంత్రానికి కొంపను చేరుకోబోతే, ఒక్కొక్కప్పుడు ఆ కొంపను కాస్తా సోల్జర్లు కూలదోసి వెళ్ళడం తటస్థిస్తుంది. పడిపోయిన గోడల మధ్య బిక్కు బిక్కురుమంటూ కూర్చున్న పెళ్లాంబిడ్డల్ని చూచుకోగానే, వాళ్ళ మనస్సు ఎలా ఉంటుందో వేరే చెప్పాలా? ఇలాంటి ఘోరాలకు బలి అవుతున్న వారే ప్రస్తుతం విప్లవకారులలో చేరిపోతున్నారు. ఇంతకంటే ఆందోళనకరమైన విషయం ఏమంటే—క్రమక్రమాన విప్లవకారుల ధైర్య సాహసాలు పెరుగుతున్నవిగాని, తరగడం లేదు.
"శనివారంనాడు, ఇక్కడ జాఫాలో, సోల్జర్లు కంటబడిన ప్రతివాడినీ, కాల్చాలనీ బుద్ధి పుడితేచాలు, కాల్చివేస్తున్నారు. ఒక గవర్నమెంట్ సర్వేయర్—చదువుకున్నవాడు; ఇంగ్లీషు మాటాడ్డం నేర్చినవాడు—తన పనులు చూచుకుని ఇంటికి వస్తూ ఉంటే, అతడిని నడివీధిలో కాల్చి చంపారు. ఇలాగే ఏడేళ్ళ పిల్లనుకూడా హత్య చేశారు.
"నాకు పత్రికను తెచ్చియిచ్చే చిన్న కుర్రవాడు—బలే చలాకీ అయినవాడు—ఇవ్వాళ ఉదయం రాలేదు. ఏమైపోయాడు చెప్మా అని విచారిస్తే, కాల్చి చంపారని తెలిసింది.
"కొన్ని రోజుల క్రితం నేను ఒక ఇంగ్లీషు జడ్జీని కలుసుకోగా, తాను మీన్షై పేటలో చూచిన దృశ్యాల్ని గురించి చెబుతూ, ప్రభుత్వాన్ని పూర్తిగా దుయ్యబట్టాడు. హెబ్రాన్లోని ఒక డాక్టర్ తమ పట్టణంలో పోలీసులూ, సోల్జర్లూ చేసిన దారుణ హత్యల్ని గురించి వొళ్లు జలదరించే కథల్ని చెప్పాడు. అక్కడ ఉన్న ఆరబ్బు షాపుల్నీ, హోటళ్ళనూ ఒక్కదాన్ని కూడా విడవకుండా దోచుకున్నారట."
ఈ బ్రిటిష్ లాయర్ లేఖలోని విషయాల్ని చూచి "అబ్బ! ఇంతకంటె ఘోరకృత్యాలు ఉంటాయా?" అని కొందరు అనుకోవచ్చును. కాని అలాంటి సందేహం అవసరంలేదు. పాలస్తీనాలో బ్రిటిష్ అధికారులు ఇంతటికంటె రాక్షసమైన చర్యల్ని కూడా చేస్తున్నారు. ఇందుకు ఉదాహరణలు కావాలంటే, "డక్కన్ టైమ్స్" (మద్రాసు) ప్రకటించిన ఈ వృత్తాంతాల్ని చూడవచ్చును:
"నసిరా సమీపంలో ఉన్న కాఫ్ర్కామా గ్రామానికి 1937 డిసెంబర్ 3వ తేదీ శుక్రవారం ఉదయం కొందరు మిలిటరీ ఆఫీసర్లు వెళ్ళారు. ఆ ఆఫీసర్లు గ్రామంలోని ముఖ్యుల్ని అందర్నీ ఇళ్లలో నుంచి బైటికి రమ్మని, వారి పాగాల్ని తీయించి ఎర్రటి ఎండలో వరసగా నిలబెట్టించి, వీపుల మీద రక్తం కారేలా రాళ్ళతో బాదారు. తర్వాత వాళ్ళ ఇళ్ళనుకూడా సోదా చూచారు.
"మరి కొంతమంది మిలటరీ ఆఫీసర్లు ఆ గ్రామంలోనే మగవాళ్ళనందరినీ పొలాలలోకి తోలారు; ఆడవాళ్ళనందరినీ మసీదులోకి చేర్చారు. ఆ మీదట సోదా అనే వంకతో ఇళ్ళ మీద పడి దోచుకున్నారు. మగవాళ్ళ బట్టల్ని ఊడదీయించి, వారి మీద కాలుతూ ఉన్న నునెను, ఇసుకను పోశారు. ఇది మిలిటరీ ఆఫీసర్లకు చెడ్డ సరదాగా కనబడినట్టున్నది. తర్వాత ఆ దౌర్భాగ్యుల్ని చాలాదూరం నడిపించారు. నడవలేక పోయిన వారిని కొరడాలతో బాదారు.