సైనికదృష్టిలో నేమి, చాలా ప్రయోజనకరంగా ఉండే అరేబియాను గుప్పిటిలో నుంచి వదలి వెయ్యడమే? పాలస్తీనా, సిరియా, ఇరాక్; ఈ మూడూ కూడా ఆసియా ఖండం భాగ్యరాసుల్ని చేరడానికి మార్గాలుగా ఉపకరిస్తవి. మోసుల్లోనూ, పర్షియన్ గల్ఫ్‌లోనూ, పెట్రోలు గనులున్నాయి. అబ్బే! అరేబియాను—దాదాపు ఇండియా అంతటి వైశాల్యం కలిగివున్న అరేబియాను—చేయిజారిపోనివ్వరాదు.
అయితే, దీన్ని పంచుకోవడం విషయంలో బ్రిటన్, ఫ్రాన్సులకు కొంత వివాదం వచ్చింది. కొంతకాలం కీచులాడుకున్న తర్వాత 1920 ప్రారంభం నాటికి అవి ఒక రాజీకి వచ్చాయి. ఈ రాజీ ప్రకారం ఇరాక్ బ్రిటన్‌కు దక్కింది. పోతే, సిరియాను—టారస్ పర్వతాలకూ, సినాయి ఎడారికీ మధ్యవున్న ప్రదేశాన్ని—బ్రిటన్, ఫ్రాన్సులు చెరికొంత తీసుకున్నాయి. దీనిలో దక్షిణ భాగాన్ని—అంటే పాలస్తీనాను—బ్రిటన్ తీసుకుంది; ఉత్తర భాగాన్ని—ఈ భాగానికి సిరియా అనే పేరు ఖాయం చేశారు—ఫ్రాన్సు తీసుకుంది. అంటే, లెబ్నాన్ సముద్ర తీరమూ, డమాస్కస్ రాష్ట్రమూ ఫ్రాన్సుకు దక్కింది. పాలస్తీనాకు తూర్పుగావున్న ఒక యెడారికొన కూడా—దీనికి ట్రాన్స్జోర్డాన్ అని పేరుపెట్టారు—బ్రిటన్ వంతుకు వచ్చింది.
ఈ విధంగా అరేబియాలో మంచి మంచి భాగాల్ని తాము తీసుకున్న తర్వాత, మిగతా ఎడారిని బ్రిటన్, ఫ్రాన్సులు హుస్సేనుకు కట్టబెట్టాయి. హెడ్జాజ్కు—మక్కా, మదీనా పుణ్యక్షేత్రాలు. దీనిలోనే ఉన్నాయి—అవి హుస్సేన్‌ను రాజుగా ప్రకటించాయి. ఇక, హుస్సేన్ కుమారుల్ని సంతృప్తి పెట్టడానికి అవి చక్కటి ఒక ఎత్తు వేశాయి. అది ఏమంటే, హుస్సేన్ జ్యేష్ఠపుత్రుడు (ఆలీ) తండ్రి తదనంతరం హెడ్ జాజ్‌కు రాజు కావచ్చుననడం; అతడి రెండవ కుమారుని (అబ్దుల్లా) బ్రిటీష్ వారి అధీనంలో ఉండే ఇరాక్‌కు రాజును చేస్తామనడం; అతడి మూడవ కుమారుని (ఫైజల్) ఫ్రెంచి వారి పరిపాలనలో ఉండే డమాస్కస్‌కు—సిరియా తూర్పు భాగానికి—రాజుగా ఉంచుతామనడం. అసలైన రాజ్యాధికారం మన చేతిలో ఉన్నప్పుడు ఇంకొకడిని రాజు అని చెప్పి దిష్టిబొమ్మగా నిలబెట్టడంలో చాలా లాభం ఉంది. అప్పుడు జరిగిన మేలు అంతా మనదీ, కీడు అంతా ఆ దిష్టిబొమ్మదీ అని చాటుతూ ఉండవచ్చును. హుస్సేన్ కుమారుల్ని రాజులుగా[1] చేస్తామనడంలో బ్రిటన్, ఫ్రాన్సులు చేసిన ఆలోచన ఇదే!
ఈ విధంగా అరేబియాను—తమ వాగ్దానాలకు భిన్నంగా—భ్రిటన్, ఫ్రాన్సులు తమలో తాము పంచివేసుకున్నా, లోకానికి మాత్రం అధర్మం చెసినట్టు కనబడకుండా ఉండడానికి "మేండేటరీ విధానం" అని ఒక తంతు చేశాయి. కొందరు ప్రజలకు స్వరక్షణకుగాని, స్వపరిపాలనకు
- ↑ చివరికి ఈ ఏర్పాటులలో ఏదీ నిలవలేదు. డమాస్కస్కురాజుగా ప్రకటించిన కొన్ని మాసాలకే ఫ్రెంచివారు ఫైజల్‌ను అక్కడ నుంచి తరిమివేశారు. అంతట అతడు తన అన్న అబ్దుల్లా బదులు ఇరాక్‌కు రాజు అయ్యాడు. వాహబీల నాయకుడైన ఇబిన్సాద్, హెడ్ జాజ్ మీద దండెత్తి వెళ్ళి, హుస్సేన్‌నూ, అతడి జ్యేష్ఠ పుత్రుడు ఆలీని తొలిగించి ఆ రాజ్యాన్ని స్వాధీనపరుచుకున్నాడు.