"పాలస్తీనాలో యూదీయలకు ఒక జాతీయ కేంద్రాన్ని ఏర్పరచడానికి బ్రిటీష్ ప్రభుత్వం వారు అనుకూలంగా ఉన్నారు. ఈ ఆశయసిద్ధికి వారు శక్తివంచన లేకుండా పాటుపడతారు. ఈ సందర్భంలో పాలస్తీనాలో ప్రస్తుతం వున్న యూదేతర సంఘాల హక్కులకు గాని ఇతర దేశాలలో వున్న యూదుల హక్కులకుగాని భంగం కలిగించే కార్యాన్ని దేన్నీ చెయ్యరు."
సైక్స్-పికాట్ ఒడంబడిక సంగతి తెలుసుకునే నిస్పృహ చెందివున్న ఆరబ్బులకు ఈ బాల్ఫర్ ప్రకటన మరెంత ఆశాభంగాన్నీ, అసహ్యభావాన్నీ కలిగించిందో వేరుగా చెప్పనక్కరలేదు.
1917 అంతం నాటికి పూర్తిగా హతాశులై ఉన్న ఆరబ్బులకు 1918లో యుద్ధ విరామం జరిగిన నాటికి తిరిగి ఆశలు పెట్టుకోడానికి కొంత అవకాశం కలిగింది. యుద్ధంలో పాల్గొన్న వివిధ రాజ్యాల మధ్య జరగవలసిన సంధికి ప్రాతిపదికగా అమెరికా అధ్యక్షుడు విల్సన్ పధ్నాలుగు సూత్రాల్ని ప్రతిపాదించాడు. వీటిలో మూడో సూత్రం ఇది:
"ఈ యుద్ధంతో సంబంధం ఉన్న ప్రతి దేశం భవిష్యత్తును, అక్కడి ప్రజల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని నిర్ణయించాలిగాని, విభిన్నరాజ్యాలు స్వలాభం కోసం చేసుకునే పెంపకంలో ఇది కేవల మొక భాగం అనే పద్ధతిని చేయ్యరాదు".
ఈ సూత్రం ప్రత్యేకంగా సైక్స్-పికాట్ ఒడంబడికను రద్దుపరచడానికే ప్రతిపాదించినట్టు ఆరబ్బలకు తోచింది. ఇక, పన్నెండో సూత్రం వారికి మరింత ఆశను పోసింది. ఆ సూత్రం ఇది:
"ఇప్పుడు టర్కీ పరిపాలన కిందవున్న వివిధ జాతుల వారికి పరిపూర్ణమైన రక్షణ నిస్తూ, ఇతరుల జోక్యమేమీ లేకుండా స్వపరిపాలనను సాగించుకోడానికి అవకాశమివ్వాలి".
"బ్రిటన్ ద్రోహం చేసినా, విల్సన్ మన పక్షాన ఉన్నాడు; మన ఆశలు ఇక ఈడేరినట్టే! మనకు స్వాతంత్య్రం లభించినట్టే!" అని ఆరబ్బులు మహదానందం చెందారుగాని, అచిరకాలంలోనే తిరిగి వారు హతాశులు కావలసి వచ్చింది.
9
ముందు జర్మన్; ఆస్ట్రియన్ సామ్రాజ్యాన్ని తమలో తాము పంచుకున్న తర్వాత బ్రిటీష్, ఫ్రెంచి ప్రభుత్వాల వారు టర్కీ సామ్రాజ్యం వైపుకు దృష్టిని మరల్చారు. "టర్కీ పరిపాలన క్రింద వున్న అరేబియా స్వతంత్ర రాజ్యంగా ఏర్పడ్డానికి అంగీకరిస్తాను" అని 1915లో (సర్ హెన్రీ మాక్-మాహోన్ ద్వారా) బ్రిటన్ వాగ్దానం చేసినమాట నిజం. ఈ వాగ్దానాన్ని బ్రిటన్, ఫ్రాన్సులు రెండూ చేరి 1918 నవంబర్ 30వ తేదీనాడు "రిపీట్" చేసిన మాటకూడా నిజం. అయితే మాత్రమేమి? ఆపత్కాలంలో లక్ష వాగ్దానాలు చేస్తాము. వాటికి కట్టుపడి ఉండడం సామాన్య వ్యక్తులకు తగుతుందేమోగాని, సామ్రాజ్య నిర్మాతలకు తగునా? పైగా, ఆర్థికంగా నేమి,