పుట:పాంచాలీపరిణయము (కాకమాని మూర్తి).pdf/9

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

8

పాంచాలీపరిణయము


సీ.

కచపాళిరుచికేళి గప్పుగప్పినయప్పుడె పికిలి బిల్లి నట్టించుకొనియె
జఘనభారము కొంత జనియించినప్పుడె రథమున కలఘుచక్రం బమర్చె
మందయానప్రౌఢి సందుగొన్నప్పుడె యంచతేజీఁ గట్టె నరదమునకు
గొప్పలు గుబ్బలైనప్పుడె జైత్రయాత్రకుఁ బూర్ణఘటు లెదుర్పడియె ననియె
నింతిబొమతీరు గనిన విల్లెక్కువెట్టెె, జూపుక్రొవ్వాఁడిదేఱినఁ దూఁపుదొడిగె
బంచబాణున కెటువంటిబలిమి యెంత, జయము గలిగించెఁ బాంచాలి జవ్వనంబు


ఉ.

సింగము లెన్నిపుణ్యములు చేసెనొ యేమి తపంబు గాంచెనో
భృంగములుం గురంగములు నేసుకృతం బొనరించేనో నదీ
భంగములున్ భుజంగములు బాపురే ద్రౌపదియంగముల్ బలెన్
సంగతిగన్నవంకఁగద చాలఁబ్రసిద్ధము లయ్యె నిద్ధరన్.


శా.

కాంపిల్యంబున కెంతకీర్తి గలిగెన్ గాండీవి కెంతబ్బె నై
లింపప్రస్తుతబాహుతేజమల కీలిజ్వాల కెంతయ్యె ని
ష్కంపప్రాభవ మెంతవార్తఁదగెఁ బాంచాలోర్వి కెంతర్హతన్
సంపాదించెను యజ్ఞసేనుఁ డిలఁ బాంచాలీవిలాసంబులన్.


క.

ఈరీతి వయసువచ్చిన, నారీతిలకంబు శుభమునకుఁ గౌంతేయుల్
రారే వత్తురు దామని, రారే రాయఁడు స్వయంవరము చాటించెన్.


ఉ.

చాటినవార్త దిక్కులఁ బొసంగ వినంబడినం గళింగ క
ర్ణాటక లాట భోట కరహాట వరాట వసుంధరాది రా
డ్ఝాటము హాటకప్రకటశాటికిరీటవినూత్నరత్నముల్
పాటిలఁ దాల్చి రాఁదొడఁగెఁ బాటలగంధి వరించు నీటులన్.


సీ.

కటకంబు చేరి కీకటభర్త పనిచెక్కడపుఁ జొక్కటపు మకుటంబు దాల్చె
మకుటంబు గాదని మగధనాథుఁడు ధగద్ధగలీను కుళ్ళాయి తగధరించె
గుళ్ళాయి గాదని కొనచుంగుపిడుపుతో ధహళాధిపతి చుట్టెఁ దగడిపాగ
పాగ గాదనుచు లంపాకపాలుఁడు గట్టెఁ జెంగావి సరిగంచుజిగిరుమాలు
మఱి రుమాలువు గాదని మత్స్యనేత, చెంపసిగఁ గెంపుతాయెతు చేరుఁ బేర్చె
గోర సిగమాని నెరి సేసకొప్పుఁ బెట్టి, మొగిలి రకులు ముడిచెఁ గాంభోజివిభుఁడు.


సీ.

భోటభూభుజుఁ గాంచి లాటభర్త లలాటపట్టిఁ గప్రపుఁజుక్క బొట్టు పెట్టెఁ
జుక్కబొట్టందంబు చూచి కాదనిత్రోచి రేఖమీఱ విభూతిరేఖ దీర్చె
భూతి యేతిరంచుఁ బోనిచ్చి పన్నీట నామంబు పద నిచ్చి నాభిఁ దీర్చె
నాభినామము పుచ్చి శోభిల్లుమృగనాభి కలికపోలిక తిలకంబు దిద్దె
నీటుమీటాయెఁ బాంచాలి నిను వరించు, నంచురాకొట్టు దిట్టమో మట్టె చూచి
యట్టులైనను భట్ట నాకట్టువర్గ, మిక్కడనె యిత్తు ననుచు నీటెక్కనిలిగె.