పుట:పాంచాలీపరిణయము (కాకమాని మూర్తి).pdf/41

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పాంచాలీపరిణయము

పంచమాశ్వాసము

క.

శ్రీరమణీమణిధారీ, ధారీధవసుత రథాంగతటభిన్నారీ
నారీశృంఖలపంగు శ, రీరీహిత గాంగలహరి శ్రీరంగహరీ.


వ.

అవధరింపుము జనమేజయునకు వైశంపాయనుం డిట్లనియె.


గీ.

ఏగుఁ బెండ్లినాఁడె హితబంధు సమ్మతిఁ, బెండ్లికూతు మొదటిపెండ్లికొడుకు
గూర్తుఁమంచు ద్రుపదకుంభినీభర్త దం, పతుల కేర్పరించెఁ బడకయిల్లు.


మ.

తనయత్యంతనిశాంతశేఖరముచెంతం దండ్రి బాల్యం బునన్
దన కర్పించిన దర్పకప్రముఖచిత్రస్తంభవిభ్రాజిభో
జనశాలాంగణపాకమజ్జనమహాశయ్యాగుహావ్యూహనూ
తనకృత్కేతనరాట్పురాతనమణీధామాంతరాళంబునన్.


మ.

నెలరాటాకుమిటారి చిత్తరువు కన్నెల్ సన్నసున్నంపుఁది
న్నెలు జేజేదొర రాతిగోడ కడవన్నె ల్వోవఁ జెంగావివ
న్నెలు పూఁగైదువు వన్నెరాయ పనిచిన్నెల్ గచ్చుమేల్మచ్చులున్
బెళకం జాలినకేళిధామ మటఁజూపెన్ మామ జామాతకున్.


క.

మంచిముహూర్తం బిది మన, పాంచాలిం దోడితెండు పతికడ కని మ
మ్మంచెన్ ద్రుపదక్షితిపతి, యంచుఁ బురోహితులు దేవి కయ్యెడఁ దెలుపన్.


క.

కొప్పువిరిదండదవిలిన, దుప్పటి వలెవాటుతోడఁ దొయ్యలి కైదం
డొప్పఁ దమతోడ నూడుపు, జొప్పలతో నప్పుడింతి సొంపుగ వెడలెన్.


గీ.

సుదతి యొడ్డాణ మేదట్టి చుట్టు గాఁగ, రాలయుంగరముల చాలెత్రాడు గాఁగ
మంచియరగందపొడి మేనిమట్టి గాఁగఁ, జిత్తజుభుజాభుజికి జగజెట్టివోలె.


గీ.

కట్టుకంబమునకుఁ గరివోలె దాదుల, బలిమి నరుగుదెంచి పడకయింటి
కడపదన్ని యవల నడుగింత యిడదాయె, నాతి మొనకు డాయ భీతిగాదె.


ఉ.

పట్టుతలాడయున్ హళఁదిపచ్చనునుం బఱపింద్ర గోపపుం
బట్టుకురాడముం దొగరుబట్టియుఁ దెల్లనిచల్వయుం బనుల్
వెట్టినకట్టుతో బటువుబిళ్లలు దంతపుఁగోళ్ళ గ్రచ్చు క్రొం
బట్టలుగన్న యానృపతి మంచముపై సతు లుంచి రచ్చెలిన్.


క.

అలకల్గొని భీతిత్రప, ల లఁతికవునుబట్టి సకియ లటునిటు దివియన్
నిలుచుండఁ గూరుచుండం, గలకంఠికిఁ బట్టె నొక్కగడియ కడంకన్.