పుట:పాంచాలీపరిణయము (కాకమాని మూర్తి).pdf/31

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

30

పాంచాలీపరిణయము


కక్షపాలికతోడ మహోక్షకోరు, రూక్షతాదీక్షతోడఁ బద్మాక్షితోడ
వీక్షణీయుఁడగుచు నిటలాక్షుఁ డబల, కక్షయక్షమ కపుడు ప్రత్యక్షమయ్యె.


క.

ఇటులు ప్రసన్నుండై ధూ, ర్జటి వేఁడుము వరమటన్న సతి పతిదానం
బిట ఘటియింపు మటంచుం, బటువాచాప్రౌఢి నేనుమాఱులు పలికెన్.


క.

పలికిన కలికిం గనుఁగొని, యళికాంబకుఁ డిట్టులనియె నైదుగురం భ
ర్తల వరియించెదు నిజ మో, జలజాక్షీ యింక నొక్కజన్మమునందున్.


వ.

అనిన విని వినతయై వనిత యవనీతలంబున నొక్కసతికిఁ బెక్కండ్రు మగ లగుట
యనుచితం బగు గావున నే నొల్లనన నల్లన గిరిజావల్లభుం డిట్లనియె నావచనం
బున నేవురుపురుషులందు ధర్మ మెడయకుండునట్లుగా వరంబిచ్చితి మెచ్చితి నన్న
సన్నుతొాంగి యంగీకరించి యేవురవరులంచుఁ బ్రత్యేకరత్యనుభవంబును గౌమార
విభవంబును బతిశుశ్రూషా మనీషా విశేష కామభోగేచ్ఛా సౌభాగ్య భాగ్యంబును
బ్రసాదింపవలయునన దానికోరిన వరంబిచ్చి గంగాతరంగిణీతీరంబుననున్న యా
ఖండలు నాయండకుం దోడ్కొనిరమ్మనిన నక్కోమలి యట్ల కాకయని కోకిలవాణీ
పినాకపాణికిం బ్రణమిల్లి యాక్షణంబ చని సహస్రాక్షుం గంగాక్షోణిం బరీక్షించు
చుండె నట దండధరుం డనిమిషారణ్యంబున సత్రయాగంబు గావించుటంజేసి
మానవులు సుఖజీవులైన మహిమకు సహింపక శతమఖముఖసంఘంబు చతుర్ముఖ
సమ్ముఖంబునకుం జని దేవా మర్త్యు లమర్త్యులయిన మాకును వానికి నంతరం బెద్ది
యని తహతహపడిన దేవతలకుఁ బితామహుం డిట్లనియె జముని తేజంబును మీ
తేజంబునుం జేరి యేవురురాజులై జనించి వారయ్యంతకుచేఁతకు హేతువగుదురనిన
బురుహూతసహితంబుగా బృందారకబృందంబు మందాకినీతీరంబు చేరునప్పుడు
తత్తటినీమధ్యంబున నొక్కయణుమధ్యామణి మనస్తాపంబు నిలుపోప కయ్యవ
రంబున.


మ.

కుధరానర్గళవృష్టివోలె వలిచన్గుబ్బన్ దృగంబుల్ వడన్
విధుబించానన యేడ్చెఁ దత్తటవతి వేల్లత్పయోజోల్లల
న్మధుపాన ప్రధమాన షడ్చరణ నానాఝంక్రియా హంక్రియా
మధురేష్వాస గుణాంకగీతలహరీ మంద్రశ్రుతిప్రౌఢిమన్.


క.

అన్నీలవేణి యేడ్చినఁ, గన్నీళ్ళన్నియును గనకకమలము లయ్యెన్
గన్నులు తామరలుంబలె, నున్నవనం గూడుటెట్టు లున్నయ్యలకున్.


క.

అచ్చెలికన్నీళ్ళు సువ, ర్ణోచ్చ సరోజోచ్చయంబు లుదయించుటకున్
విచ్చలవిడి నచ్చెరుపడి, యచ్చేడియఁగని వియచ్చరాధిపుఁ డనియెన్.