పుట:పాంచాలీపరిణయము (కాకమాని మూర్తి).pdf/24

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తృతీయాశ్వాసము

23


గీ.

కుశలమా మీకు బాడబగూఢవేష, భాషణాలంకృతుల మమ్ముఁ బాండవేయు
లగుట యేరీతిఁ దెలిసితి రన్న నగుచు, ధర్మసూతికి నందనందనుండు పలికె.


చ.

క్షత్రియతేజము ల్తెలియఁజాలరె ధీనిధులైనవారు భూ
మిత్రిదశాకృతుల్ గుఱుతె మీగుఱు తేయుటె తెల్పఁజాలెడిన్
ధాత్రిఁ బ్రధూమరేఖలు ధనంజయుఁ జూపవె యీధనంజయ
క్షాత్రమె బైలుచేసె ననఁగా యమసూనుఁడు హర్షితాత్ముఁడై.


మ.

కరటిం గాంచిన తండ్రి వీవ ధృవు రక్షారాహితిక్షీణు న
క్షరుగాఁ బట్టము గట్టినట్టి యజహత్కారుణ్యపాధోధి వీ
వరిపూర్విన్శరణార్థి కిచ్చు దొరవీవా నాఁటికిన్ నేఁడు నిన్
గరుడస్యందను నందనందను ఘనుం గంటింగదా మాధవా.


క.

ద్వారక యెక్కడ ద్రుపదుని, యూ రెక్కడ యూరిలోన నొకకడఁ గుం
కారాగారం బెక్కడ, యీ రరుదెంచుటకు భాగ్య మేమందు హరీ.


సీ.

కడుఁజిక్కి యెక్కఁడెక్కడ మొఱవెట్టునోయని యక్కడిదెక దాహాళి నీకు
పట్టి యెవ్వఁడు బంటుఁగట్టి కొట్టించునోయని యక్కడిదెకదా కనికరంబు
రిపుఁడైనను విపత్తు లెపు డడ్డపడునొకోయని యక్కడిదెకదా యాదరంబు
తలిదండ్రిప్రాపుతో దాసుఁ డెంత డలుసో యని యక్కడిదెకదా యమితకరుణ
తనులతాయాస మెంచెదొ తనవు దాఁచు
కొనెదొ యీగికిఁ గొంకెదొ కొసర నిడెదొ
కొలువు గొలిచిన మది నమ్ముకొన్న నిన్నె
యన్యులఁ దలంతురే రక్ష కంబుజాక్ష.


క.

మాతండ్రిగులు తెఱుంగుదు, మాతల్లివి తండ్రియైన మాధవ మాకున్
ధ్రాతవు నేతవు హితసం, ధాతవు గద యాదవాభ్యుదయకరహృదయా.


వ.

అని యని వారితోదితఖనియై కని యాతండు కొనియాడిన.


గీ.

లక్కయిలుచెంత నొక్కింత మొక్కవోక, వెక్కసపుఁగౌరవులనెల్ల లెక్కగొనక
కన్యఁ గైకొంటి రిఁక మేలుగలుగు ననుచు, నతని నూరార్చి సబలుఁడై యరిగె శౌరి.


ఉ.

అంతట నందనుం బిలిచి యాద్రుపదుండు కుమారిఁగొన్నవాఁ
డెంతటివాఁడొ పేరు కుల మెయ్యదియో నెల వెద్దియొక్కొ యా
వింతయుఁ గాంచిరమ్మనుచు వెంటనె పంపినఁ గుంభకార గే
హాంతముఁ జేరి వేఁ దెలిసి యాతఁడు గ్రమ్మఱి తండ్రి కిట్లనున్.