పుట:పాంచాలీపరిణయము (కాకమాని మూర్తి).pdf/17

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

16

పాంచాలీపరిణయము


లోచనానంద మొంద విరోచన ప్ర, భాచణా చక్రవాళా చలాచటాస్థ
లీచలత్ప్రభులతను నారాచమైన, రాచకొమరిత పాంచాలి చూచునపుడు.


సీ.

కోసలాధీశుండు మీసముల్ వడిగొల్పె నంగి చేతులఁ ద్రోచె నంగవిభుఁడు
జము ళిలోఁ జేయి సవరించెఁ గురురాజు శకభర్త చౌకట్లు చక్కదిద్దె
గౌళభూభుజుఁడు బాగాలకుఁ గైసాచె బంటుపై నొరిగె లంపాకనృపతి
బీరంబుతో బిఱ్ఱబిగిసెఁ గాశ్మీరుండు దహళుండు పూబంతి తావిగొనియె
సూరసేనుండు భుజములు చూచుకొనియెఁ, గుంతలము లింత యెగదువ్వెఁ గుంతలుండు
చంచలదృగంచలములు పాంచాలిఁ జేరి, యించుకించుక మీఁద వర్షించునపుడు.


మ.

ధృతిదూలింపని పార్థివుండు నురుబారిం గాసిలంబోని భూ
పతి భూషింపని రాజు మ్రాన్పడని భూపాలుండు చేతోగతిన్
నతి గావింపని మేదినీశుఁ డొకఁడైనన్ లేఁడు పాంచాలరా
జతనూజాతనుజాతనూతనవిలాసప్రౌఢి సామాన్యమే.


గీ.

కలజనంబుల తలఁపులో వలపు గరఁచి, కరువు గట్టిన బొమ్మ యీకలికికొమ్మ
ముజ్జగంబులు మోహాబ్ధి మునుఁగు టెట్లు, వనిత పాంచాలి యనిపించుకొనుట యెట్లు.


సీ.

తులఁదూఁగు మౌక్తికంబులతోడ దంతముల్ లలితగాత్రము కల్పలత యొసంగుఁ
బాలిండ్లు వెచ్చించు భర్మకటాహముల్ ధరదయచేయు నితంబతటము
తిలపద్మములనిచ్చుఁ దీరైనముక్కు మో మంబరంబు ఫలించు నసదుఁగౌను
నతనాభిశోభి పున్నాగంబుగొమ్మను బృథుచానురము సమర్పించువేణి
యెంచఁచగు నీఠీవిఁ దేలించె నౌర, కాకయుండిన ఘనకీర్తి కలుగు టెటులు
పటుకిరీటంబుగల నరపతికిఁగాని, కొంచెగానికి దొరక దీకువలయాక్షి.


క.

కడుమింటిపోల్కి విడుమీ, నడుమింతయుఁ గానరాదు నఖములరేఖల్
నిడుమించు లీనుకన్నులు, నుడుమీసంబులకు నెక్కుడోహెూ చెలికిన్.


క.

చెవులారఁ బల్కుపల్కుల్, చవులా మకరందమునకుఁ జవులాదంత
చ్ఛవులాహా కుచములకో, కవులా వర్ణించువారు కవులాచెలువన్.


శా.

చంద్రాంతఃపురకామినీమణి విలాసంబుల్ విలోకింప మో
యింద్రాదిత్య భవావరోధమహిళాహేళాకళల్ చూడ మో
సాంద్రంపుం బసిపాపయల్లు నవలాసౌందర్య మీక్షింప మో
రుంద్రశ్రోణులు మందగామిను లొయారుల్ సాటియే దీనికిన్.


శా.

ఒయ్యారమ్ముల యిక్క యిక్కలికి నేత్రోత్ఫుల్లవిద్యుల్లతల్
వెయ్యారమ్ముల కమ్మవింటిదొరకున్ వెచ్చించుఁ బొమ్మంచులం
బయ్యాడుందల మంచుబింబముల సంబాళించుఁ గెమ్మోవి దా
లియ్యాఁడుం దలమిన్న చన్నుగవతో నీడాగిరీడావళుల్.