పుట:పల్నాటి చరిత్ర.pdf/52

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పల్నాటి చరిత్ర

43

నేలుచుండెను. కోడిపోరు పందెములకని బ్రహ్మనాయని గుర జాలకు పిలిపించి మాయచేతను మోసముచేతను నతనిని నాయకురాలు కోడిపందెములందు గెలిచెను. ఏర్పఱచుకొన్న సమయము ప్రకారము మాచర్ల సీమను నలగామరాజునకు వదలి సపరివారముగా వెడలిపోయి యేడు సంవత్సరము లడ వులందు బ్రహ్మనాయుడు గడపెను. నలగామరాజు నల్లుడు యలరాచమల్లు యనువాడు బ్రహ్మనాయునివద్ద నుండెను. తమ మాచర్లసీమను మరల తమకిమ్మని నలగామరాజు వద్దకు అలరాచమల్లుకు బ్రహ్మనాయుడు రాయబార మంపెను. కాని నలగామరాజు వినలేదు. తిరిగి బ్రహ్మనాయనివద్దకు బోవుచుం డగా అలరాచమల్లును నాయకురాలు విషప్రయోగముచే చంపించెను. అదివిని బ్రహ్మనాయుడు నలగామునిపై దండెత్తి మేడపినుండి కారెమపూడివచ్చెను. నలగాముడును తన సైన్య ముతో వచ్చి కారెమపూడివద్దవిడిసి సంధికై బ్రహ్మనాయని వద్దకు రాయబార మంపెను. సంధి కుదురు నట్లుండెను. బ్రహ్మనాయని కుమారుడు బాలచంద్రుడు యుద్ధము సంగతి తెలియక మేడపిలో బొంగరము లాడుచుండెను. బొంగరము కాలికి తగిలిన యొకకోమటి స్త్రీవలన యుద్ధవిషయము తెలిసికొని యుద్దమునకుపోవ నిశ్చయించుకొని సెలవునకై భార్యయగు మాంచాలయింటికి పోయెను. భార్య మోహమున బడి యుద్దవిషయము మఱచెను. అది గ్రహించి వీరపత్నియగు మాంచాల యేదియోయొక నెపముతో నా రాత్రిగడిపి