పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/93

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఉత్తరఖండము-ద్వితీయాశ్వాసము

61


నతిథు లెవ్వరియింట నశనంబు భుజియింతు
       రాతని పితృజను లక్షయముగ
బ్రహ్మలోకంబునఁ బదివేలదివ్యహా
       యనములు వసియింతు రనఘచరిత!


తే.

యతిథి కీడుకంటె ధర్మంబు లవని లేవు
[1]పరమగృహమేధి కతిథియ పరమబంధుఁ
డతఁడ కల్మషజాలంబు నడఁపఁజాలు
నతిథి గడపినఁ బరలోకహాని యగును.

87


వ.

మఱియు నతిథిసత్కారంబు చేసిన పుణ్యుండు యమదర్శనం
బొల్లక యమృతభోజియై యనేకదివ్యవర్షంబులు దివినుండి పిదప
భూపతియై జన్మించి ధర్మపరుండగు. సర్వభూతంబుల ప్రాణం
బులు నన్నంబునంద [2]యాశ్రయించి యుండు గావున నన్న
ప్రదాతయె ప్రాణప్రదాత యగునని చెప్పి కింకరుండు మఱియు
నిట్లనియె.

88


క.

విను కేసరిధ్వజుండను
జనపతి దివినుండి భువికిఁ జనుదేరంగాఁ
గని శమనుఁ డతనితోడను
వినఁ జెప్పిన మాటలెల్ల విను మేర్పడఁగన్.[3]

89
  1. పరగ (తి-హై)
  2. యాశ్రయించుఁ గావున (ము)
  3. ఈ పద్యము తరువాతగల యధికపాఠము.

    క. అన్నంబిడు నృపసత్తము
    అన్నంబిడు నృపవరేణ్యు అవనీస్థలియం
    దున్నపుడె ధర్మమతివై
    క్రన్నన సురలోకకాంక్ష గలిగెన యేనిన్.

    వ. అని యప్పగించె నట్లు గావున అన్నదాన సమంబగు దానంబు లేదు. (హై-తి)