పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/83

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఉత్తరఖండము-ద్వితీయాశ్వాసము

51


ఆ.

[1]అప్పువారిచేత నాఁకకు బెగ్గిలి
కూడుఁ జీరలేక కుంది కుంది
వీటిలోన నుండ వెఱచి దీనాత్ములై
వెడలి యటవి నాటవికులఁ గూడి.

43


వ.

ధనుర్బాణపాణులై యనేకవరాహకురంగచమరాదిమృగంబు
లను నానావిధవిహంగసమూహంబులను వధియించి తన్మాంసం
బశనంబుగా దినంబులు గడపుచు నతినీచవర్తునులై చరియించుచు
నొక్కనాఁడు మహావిటపిమధ్యపర్వతగుహాంతరంబులకు మృగ
హరణార్థంబు చనినయెడ శ్రీకుండలు నొక్కపుండరీకంబును
వికుండలు నొక్కదుష్టోరగంబునుం గఱచిన నక్కాననంబున
దిక్కు దెసలేక యక్కుమారు లొక్కదివసంబున మరణంబు
నొందిరి. అట్టియెడ నవ్వైశ్యులం బాశబద్ధులం జేసి యమ
దూతలు సమవర్తిసన్నిధికిం గొనిపోయి దురాచారులగు వారలం
జూపినం జూచి [2]యముం డిట్లనియె.

44

శ్రీకుండల వికుండలులు యమసదనంబునకుం జనుట :

క.

[3]వీరలలోపల నొక్కని
ఘోరంబగు నరకమునకుఁ గొంపొం డొకనిం
గారవమునఁ ద్రిదివమునకు
బోరనఁ గొనిపొండు దివిజపుంగవుకడకున్.

45


క.

అని దండధరుఁడు పనిచిన
విని కింకరవరులు కూడి వేగమ నరకం
బున శ్రీకుండలుఁ ద్రోచిరి
గొనకొని యొకదూత యావికుండలు కనియెన్.

46
  1. అప్పువారి చేతియాకకు (తి)
  2. చిత్రగుప్తునిమొగంబు చూచి యముం డిట్లనియె (తి-హై)
  3. వీ రిరువురిలో (హై)