పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/68

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

36

పద్మపురాణము


వ్రతనిష్ఠ సలిపి త్రికాలంబును విష్ణు నారాధించుచు మాఘశుద్ధైకాదశీ
పర్యంతంబుగా నీవ్రతంబు నడపి దురితనిర్ముక్తుండ వగుము.
ద్వాదశినాఁడు నిన్ను మంత్రోదకంబుల నభిషిక్తుం జేసెద నంత
నీవు మదనవదనుండ వగుదువని చెప్పి భృగుండు విద్యాధరుం
గనుంగొని మఱియు ని ట్లనియె.

166


క.

విను మాఘస్నానంబున
ననయము నాపదలు వాయు నఘములు వొలియున్
వినుతాఖిలవ్రతాదిక
ఘనదాన[1]ఫలంబులెల్ల గలుగు నరులకున్.

167


క.

మాఘము యోగముకంటెను
మాఘము యజ్ఞములకంటె మతిఁ బరికింపన్
మాఘం బశేషధర్మా
మోఘఫలప్రదము గాదె ముల్లోకములన్.

168


సీ.

చెలఁగి పుష్కరకురుక్షేత్రంబులందును
       దనరు బ్రహ్మావర్తమునఁ బ్రయాగ
నవిముక్తమునను గంగాంబుధి సంగతిఁ
       బదివత్సరంబులు భక్తితోడ
సుస్నాతుఁడై నట్టి సుకృతంబు గలుగు మా
       ఘమునందుఁ ద్రిదినావగాహియైన
నని చెప్పు మునివాక్య మాకర్ణనము చేసి
       యయ్యాశ్రమంబున కధికనిష్ఠ


తే.

భృగువుతోఁ గూడి మణికూటనగముమీఁద
[2]నిర్ఝరిణియందు సుస్నాననిత్యవిధులు
సతియుఁ దానును గావించి యతని కరుణ
జంద్రముఖుఁ డయ్యె విద్యాధరేంద్రుఁ డధిప.

169
  1. వ్రతఫలములు (ము)
  2. నిర్ఝరులయందు (ము)