పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/6

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

12

ప్రాధాన్యం ఉన్నది. వేదవేత్తకు పరిపాలకునికి పురాణజ్ఞానం ఆవశ్యకమన్నారు. కౌటిల్యుడు తన అర్థశాస్త్రంలో రాజసభలో పౌరాణికుని నియుక్తి తప్పనిసరి చేసినాడు. రాజకుమారుల అవశ్యపాఠ్యాంశములలో పురాణాలను చేర్చినాడు. ఈవిధంగా వేదసారాన్ని పురాణేతిహాసాల కథోపాఖ్యానాల ద్వారా అందించే ప్రయత్నం మనదేశంలో చాలాకాలంనుండి వస్తున్న సంప్రదాయం. పండితులు అక్షరాస్యులు నిరక్షరాస్యులు జానపదులు పురాణశ్రవణం ద్వారానే మన ప్రాచీనవిజ్ఞానాన్ని సంప్రదాయాన్ని ఆకళించుకొని తరతరాల వారికి అందిస్తున్నారు. ఏబదేండ్లకు పూర్వం ప్రతిగ్రామంలో పురాణకాలక్షేపం జరిగేది. ఇప్పటికీ అక్కడక్కడ ఈ సంప్రదాయం ఉన్నది. అల్పసంఖ్యాకులైన బ్రహ్మక్షత్రియులుతప్ప మిగతా జనులందరు పురాణోక్త కర్మకాండను పాటించటం పురాణాల కున్న మాన్యతను చాటుతుంది.

తెలుగులో పురాణాలు: ఆంధ్రసాహిత్యం పురాణేతిహాసాల అనువాదంతో ప్రారంభమై తరువాతికాలంలో పురాణేతిహాసాల్లోని స్వల్పమైనకథలను విపులీకరించి ప్రబంధించుటతో పరిపుష్టమైనది. బ్రహ్మాండాది నానాపురాణవిజ్ఞాననిరతులైన నన్నయగారు పరమపౌరాణికుల్ బహుపురాణ సముచ్చయంబని కొనియాడే భారతాంధ్రీకరణానికి ఉపక్రమించినారు. తిక్కనగారి శిష్యుడు మారన తెలుగులో మొదటి పురాణరచయిత. కవిత్రయంలో చివరివాడైన ఎఱ్ఱాప్రగడ నరసింహ హరివంశపురాణాలు రచించినాడు. కవిత్రయం తరువాత మహాకవిగా పేర్కొనదగిన శ్రీనాథుడు అభ్యర్హిత బ్రహ్మాండాది మహాపురాణచయ తాత్పర్యార్థ నిర్ధారిత బ్రహ్మజ్ఞానకళా నిధానము. ఆయన వేమభూపాలుని కొలువులో అఖిలపురాణవిద్యాగమములు వినిపించేవాడు. ఆంధ్రకవితాపితామహ అల్లసాని పెద్దన పురాణాగమేతిహాసపదార్థస్మృతియుతుడు. ఆయన ఏ ముహూర్తాన ప్రబంధేతివృత్తానికి ఒరవడి పెట్టినాడో కాని తరువాతికవు లందరూ పురాణాల్లోని ఇతివృత్తాలను వస్తువుగా గ్రహించి ప్రబంధాలు ప్రపంచించినారు. ఆధునికయుగానికి పూర్వం తెలుగు కావ్యప్రపంచంలో అధికభాగం పురాణేతిహాసాద్యాద్య సత్కథలే.