పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/5

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

11

సర్గాది పురా విషయప్రాధాన్యం తగ్గి పురుషార్థాలు మతాలు వాటిపాశస్త్యం వివిధదేవతా స్థల, వ్రత మాహాత్మ్యాలు పెరిగిపోయినవి. ఈ విధంగా 13వ శతాబ్దం దాకా పురాణాలు మార్పులకు చేర్పులకు గురిఔతూ బాగా పెరిగిపోయినవి. భారతీయ జనసామాన్యానికి పురాణానుశాసనం జీవితధర్మం ఐనది.

పురాణాలను వివిధదృష్టి కోణాలతో విభజించినారు. అమరసింహుడు చెప్పిన లక్షణాలకు అదనంగా చేరినవి ఎంతతక్కువై తే ఆ పురాణా లంతప్రాచీనాలని గుర్తించవచ్చు. ఈ దృష్టితో వాయు, బ్రహ్మాండ, మత్స్య, విష్ణుపురాణాలు ప్రాచీనతమములని నిర్ణయం. బ్రహ్మ, విష్ణు, శివ, అగ్ని, సూర్యాది దేవతల కిచ్చిన ప్రాధాన్యాన్ని బట్టి పురాణాలను సాత్త్విక, రాజసిక, తామస పురాణాలుగా విభజించినారు. శ్రీమన్నారాయణుని కీర్తించే మోక్షప్రదములైన విష్ణు నారదీయ భాగవత గారుడ పాద్మ వరాహ పురాణాలు సాత్త్వికము లన్నారు. సరస్వతీ చతుర్ముఖ కృశానుల స్తుతించే స్వర్గప్రదములైన బ్రహ్మాండ, బ్రహ్మవైవర్త, మార్కండేయ, భవిష్య, వామన, బ్రహ్మపురాణాలు రాజసికములుగా గుర్తించినారు. శివ, లింగ, వినాయక, కుమార, దుర్గాదులను కీర్తించే మత్స్య, కూర్మ, లింగ, శివ, స్కాంద, అగ్ని పురాణాలను తామసములుగా పరిగణించి నారు. ఈ సాత్త్వికాది భేదాలు మతదృష్టితో ఏర్పడినవని స్పష్టం. ఇంకా పురాణాలు పెక్కు తీరులు. 1. వివిధకళావిజ్ఞానశాస్త్రసారసంగ్రహాలుగా పేర్కొనదగినవి గారుడ, అగ్ని, నారద పురాణాలు. 2. తీర్థవ్రతమాహాత్మ్యాలు వర్ణించేవి పాద్మ, స్కాంద, భవిష్య పురాణాలు. 3. రెండుసార్లకంటె ఎక్కువ సంస్కరింపబడినవి బ్రహ్మ, భాగవత, బ్రహ్మవైవర్తపురాణాలు. 4. చారిత్రకాంశము లున్నవి బ్రహ్మాండ, వాయుపురాణాలు. 5. మతాలకు సంబంధించినవి శైవ, లింగ, వామన, శాక్త, మార్కండేయ పురాణాలు. ఖిలసంస్కరణములు వరాహ, కూర్మ, మత్స్యపురాణాలు.

ఉపనిషత్కాలంనాటికే పురాణాలు సుస్థిరరూపం తాల్చినట్లు పండితులు భావిస్తున్నారు. మన ధర్మశాస్త్రాల్లో స్మృతుల్లో పురాణానికి చాలా