పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/4

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

10


"సర్గో౽స్యాధ విసర్గశ్చ వృత్తీ రక్షాన్తరాణి చ,
వంశో వంశానుచరితం సంస్థాహేతు రపాశ్రయః

దశలక్షణాలని భాగవతపురాణ నిర్వచనం. ఇందులో వృత్తి = జీవకల్పనం, రక్ష = భగవదవతారాలు, సంస్థ = ముక్తి, హేతువు = అవ్యక్తజీవుఁడు, అపాశ్రయము = పరబ్రహ్మములనే మరొక ఐదు లక్షణాలు అదనంగా చేరినవి. బ్రహ్మవై వర్తపురాణం మహాపురాణ లక్షణాలు దశాధికంగా పేర్కొన్నది.

సృష్టిశ్చాపి విసృష్టిశ్చ స్థితిస్తేషాం చ పాలనమ్,
కర్మణాం వాసనావార్తా మనూనాం చ క్రమేణ చ.
వర్ణనం ప్రలయానాం చ మోక్షస్య చ నిరూపణమ్,
ఉత్కీర్తనం హరేరేవ దేవానాం చ పృథక్ పృథక్.
దశాధికం లక్షణం చ మహతాం పరికీర్తితమ్.

కర్మవాసన, మోక్షనిరూపణం, హరినామసంకీర్తనం, వివిధదేవతావైశిష్ట్యగుణవర్ణనం దీనిలోని ప్రత్యేకతలు.

పురాణాలు మన అమూల్యనిధినిక్షేపాలు. మన మత రాజకీయ సాంఘిక తాత్త్విక కళాసంస్కృతీ సర్వస్వాలు. మన ప్రాచీనఋషులు మేధావులు. వారి ఆలోచనలు ప్రసరించినంత మేరకు అధిభౌతిక ఆధ్యాత్మిక జీవితవిషయాలకు సంబంధించిన సమస్తవిజ్ఞానాన్ని సమాచారాన్ని పురాణాలకు ఎక్కించినారు. దాన, వ్రత, భక్తి, యోగ, వేదాంత, వైద్య, సంగీత, నాట్య, భూగోళ, వాస్తు, గణిత, మంత్ర, తంత్ర, వ్యాకరణ, ఛందో౽లంకార, రాజనీతిప్రభృతి వివిధశాస్త్రవిషయాలు, నిత్యనైమిత్తికవిధులు, స్నాన జప తప స్తీర్థ క్షేత్ర మహాత్మ్యాలు చేర్చి పురాణాలను విజ్ఞానసర్వస్వాలుగా తీర్చిదిద్దినారు. పురాణాల్లోలేని విషయం ప్రపంచంలోనే లేదనిపిస్తుంది. అందుకే నారదీయ పురాణం—

"యన్న దృష్టం హి వేదేషు తత్సర్వం లక్ష్యతే స్మృతౌ,
ఉభయో ర్యన్నదృష్టం హి తత్పురాణైః ప్రణీయతే.

అంటూ పురాణాల ఘనతను చాటింది. పురాణాల్లో విషయవైవిధ్యం పెరగడంతో ప్రాచీన పంచలక్షణాల ప్రమేయం కుంచించుక పోయింది.