పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/3

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

9

"పురా౽సి నవం పురాణ" మని, "పురా నీయతే ఇతి పురాణ" మని, "యస్మాత్ పురా హి అనతి ఇదం పురాణ" మని, "పురా పూర్వస్మిన్ భూతమితి పురాణ" మని పురాణ నిర్వచనం తీరుతీరులు.

మహాభారతకాలం నాటికే సంస్కృతంలో 18 పురాణా లుండినట్లు తెలుస్తుంది. వీటిని సులభంగా గుర్తుపెట్టుకోవటానికి—

"భద్వయం మద్వయం చైవ బ్రత్రయం వ చతుష్టయమ్,
అనాపలింగ కూస్కాని పురాణాని ప్రచక్షతే"

అనే శ్లోకం ఒకటి ప్రచారంలో ఉన్నది. భ ద్వయ మనగా భాగవత - భవిష్య పురాణాలు, మ ద్వయమంటే మత్స్య- మార్కండేయ పురాణాలు. బ్ర త్రయ మంటే బ్రహ్మ - బ్రహ్మవైవర్త - బ్రహ్మాండపురాణాలు. వ చతుష్టయ మంటే విష్ణు - వరాహ - వామన - వాయుపురాణాలు. అ = అగ్ని, నా = నారద, ప = పద్మ, లిం = లింగ, గ = గరుడ, కూ = కూర్మ, స్కా = స్కాందపురాణాలని సంకేతం. ఇవి మహాపురాణాలు. ఇవికాక 1. సనత్కుమార, 2. నరసింహ, 3. నంద, 4. శివధర్మ, 5. దుర్వాస, 6. నారదీయ, 7. కాపిల, 8. వామన, 9. ఔశనస, 10. మానవ, 11. వారుణ, 12. కలి, 13. మహేశ్వర, 14. సాంబ, 15. సౌర, 16. పరాశర, 17. మారీచ, 18. భార్గవములు ఉపపురాణములు. ఇవి అనంతరకాలానికి చెందినవి. ఇంకా మౌద్గలకాళ్యాద్యుపోపపురాణాలు పెక్కు లున్నవట.

అమరకోశం 'సర్గశ్చ ప్రతిసర్గశ్చ వంశోమన్వంతరాణి చ, వంశానుచరితం చేతి లక్షణానాం తు పంచకమ్‌' అని పురాణలక్షణాలను ఉట్టంకించింది. ఇవి 1. సర్గము = ఆదిసృష్టి, 2. ప్రతిసర్గము = కల్పాంతంలో జరిగే పునస్సృష్టి, 3. వంశము =దేవతల, దేవర్షుల బ్రహ్మర్షుల గోత్రానుక్రమం, 4. మన్వంతరము = మనువుల వంశాలు, వారి పరిపాలన కాలాలు, వంశానుచరితము = సూర్య చంద్రవంశపు రాజుల చరిత్రలు, ఈ లక్షణాలు కొన్నింటిలో కొన్ని, మరికొన్నింటిలో కొన్ని తప్పక కనిపిస్తాయి. పంచలక్షణాలు ఉపపురాణాలకే గాని మహాపురాణాలకు—