పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/2

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఉపోద్ఘాతము


పురాణములు : 'ఇతిహాస పురాణాభ్యాం వేదం సముపబృంహయే'త్తని మహాభారతం చాటటంచేత వేదోపబృంహణార్థం వ్యాసభగవానులు పురాణవాఙ్మయమును సృష్టించినారని సంప్రదాయజ్ఞుల అభిప్రాయం. బ్రహ్మ వేదాలకంటె ముందే శతకోటిశ్లోకప్రవిస్తరమైన పురాణమును స్మరించినాడనీ దానిసారమునే వేదవ్యాసుడు భూలోకంలో ప్రతిద్వాపరంలో చతుర్లక్షపరిమితమైన అష్టాదశపురాణసంహితగా రూపొందిస్తాడని మత్స్యపురాణకథనం. వేదంకంటె అలిఖితపురాణమే ప్రాచీనమని తాత్పర్యం.

మొదట బ్రహ్మాండపురాణ మొక్కటే ఉండేదని తరువాత వాయ్వాదిపురాణాలు ప్రకటమైనాయని పరిశోధకుల తీర్పు. క్రీ. శ. 5వలశతాబ్దం నాటికే బ్రహ్మాండపురాణం యవద్వీపవాసుల కవిభాషలోనికి అనూదితమట. వాయుపురాణం "పురాణం సర్వశాస్త్రాణాం ప్రథమం బ్రహ్మణాస్మృతం, అనంతరం చ వక్త్రేభ్యో వేదాస్త స్య వినిర్గితాః"అని పురాణప్రాచీనతను చాటింది. వాజసనేయీ బ్రాహ్మణోపనిషత్తు వేదాలతోపాటు ఇతిహాస పురాణాలను పరమేశ్వర నిశ్శ్వాసరూపాలుగా అభివర్ణించింది. నారదీయపురాణము వేదార్థంకంటె పురాణార్థమే అధికమన్నది. వేదాల్లోని కథేతిహాసభాగాలు పురాణాలనుండి చేరినవట. వ్యాసులవారు తమశిష్యుడైన రోమహర్షణునికి పురాణసంహితను బోధించినాడని, ఆయన తన శిష్యులు అగ్నివర్చ - మైత్రేయ - సాంశపాయన - కాశ్యప - సావర్ణి అకృతప్రణాదులకు ఉపదేశించినాడని, వారు ఆ యా రాజులు చేసినయజ్ఞాల్లో పురాణాలు వినిపించినారని, తరువాతికాలంలో సూతవంశీయులు పురాణాలను ప్రచారం చేసినారని, కనుకనే తొలుత వేలసంఖ్యకు పరిమితమైన పురాణసంహిత రానురాను లక్షలగ్రంథంగా విస్తృతిని వైవిధ్యమును పొందినదంటారు.