పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/30

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

36

పద్మపురాణం ప్రస్తుత సంశోధిత ప్రతి : మడికి సింగన కృతమైన పద్మపురాణోత్తరఖండం మొదటిసారి వండితపరిష్కృతమై పువ్వాడ వెంకటరావు పంతులవారిచే స్వకీయ వర్తమాన తరంగిణీముద్రాక్షరశాలలో 20-12-1865 నాడు ముద్రింపించి ప్రచురించనైనది. దీనికి విషయసూచిక మాత్రం ఉన్నది. ఉపోద్ఘాతం లేదు. ఇది 241 పుటల గ్రంథం. 11 ఆశ్వాసాలలో మొత్తం 2604 గద్య పద్యా లున్నవి. నాకు లభించిన ముద్రితప్రతి ఇదే. తరువాత మరల పువ్వాడ రామచంద్రరావు 1925 లో అచ్చు వేయించినారట కాని నా కా ప్రతి దొరకలేదు. తెలుగు వాఙ్మయోద్ధారకులు సి. పి. బ్రౌన్ మహాశయుడు దీనికి 1832 లో శుద్ధప్రతి సిద్ధం చేయించినాడు. దాని వివరాలు (D. No. 18 కాగితం)

"పద్మపురాణోత్తరఖండమునకు సింగనకవి లెస్సగా తెనుగుచేసి యుండగా కాలాంతరమందు లేఖకదోషములచేత ననేకస్థలములయందు చెడిపోయి శుద్ధప్రతి లేకయుండుటచేతను అనేకప్రతులు తెప్పించి గీర్వాణమునకు సరిగా అధ్యాయసంఖ్య యేర్పడేటట్టున్ను, నిర్దోషముగా నుండేటట్టున్ను, పార్శ్వములయందు ఆ యా కథాభాగముల యందలి వర్ణనాంశములు మొదలైన వాటియొక్క సూచనలు వ్రాయబడియుండేటట్టున్ను యీప్రకారము తీర్పు చేయవలసినదని మచిలీపట్టణం న్యాయకర్తలైన మహారాజశ్రీ చా. పి. బ్రౌన్ దొరగారు అనుజ్ఞ యిచ్చినందున శాలివాహన శకవర్షంబులు ౧౭౫౪ (1754) అగు నేటి నందననామ సంవత్సరమునకు సమానమైన యింగిలీషు యుగ ౧౮౩౨ (1832) సంవత్సరమందు బందరులో జూలూరు అప్పయ్య సంపూర్ణముగా పదకొండు ఆశ్వాసములున్ను తీర్పుచేసి గీర్వాణమునకున్ను తెనుగునకున్ను కొన్నిస్థలములయందు భేదములు వచ్చియుండగాను అధ్యాయక్రమవ్యత్యయములు ఆయాస్థలములయందు విశదపరచడ మైనది. యీ పద్మపురాణమందు ఉత్తరఖండము మాత్రము తెనుగు అయినట్టు తెలియబడుచున్నది కాని కడమ ఖండములకు తెనుగు చేసినట్టుగా యెక్కడ నున్ను మాకు కనబడలేదు.