పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/24

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

30

ఆచార్య ఖండవల్లి నిడుదవోలువారల అభిప్రాయానుసారం మడికి సింగన శ్రీనాథుని సమకాలీనుడు. తదితరులదృష్టిలో క్రీ. శ. 1350-1400 నడిమికాలము వాడు. ఎఱ్ఱాప్రగడ పండువాడై యుండగా మడికి సింగన యువకుడు. కనుకనే పూర్వకవిస్తుతిలో నన్నయ తిక్కనలనే స్మరించినాడు గాని ఎఱ్ఱన ఊసెత్త లేదందురు.

మడికి సింగనకు ఆంధ్రసాహిత్య చరిత్రలో తగినస్థానం లభించలేదనిపిస్తుంది. అందుకు కారణం అతడు - అటు కవిత్రయం ఇటు శ్రీనాథుడు - ఉద్ధతుల మధ్యకాలంలో ఇరుకునపడ్డవా డనుకొందును. మనకు అతని నాల్గుకృతులూ విశిష్టమైనవే. పద్మపురాణోత్తరఖండం గురించి ఇదివరకే ముచ్చటించుకున్నాము.

మడికి సింగన రెండవకృతి ద్విపద భాగవతం దశమస్కంధం. తంజావూరు సరస్వతీమహల్ గ్రంథమాలలో 1950లో ప్రకటితము. పరిష్కర్త వాసిష్ఠ. అ. మహాదేవశాస్త్రి. ఇది పోతన భాగవతంకంటె ముందు వెలువడిన భాగవత దశమస్కంధం. ఇందులో మధుర, కల్యాణ, జగదభిరక్ష కాండలు మాత్రమే ఉన్నాయి. మిగతకాండలు లుప్తమైపోయినవి కనుక అసమగ్రం. ధనుర్యాగంనుండి జరాసంధుని బలరామకృష్ణుల హత్యాప్రయత్నంవరకు మధురకాండ, రుక్మిణీకల్యాణంనుండి ఉషాకల్యాణందాక కల్యాణకాండ, నృగశాపంనుండి శిశుపాలవధదాక జగదభిరక్షకాండ. పాల్కురికి సోమన, గోన బుద్దారెడ్డి చేపట్టిన తెలుగు జాతీయఛందస్సు ద్విపదల్లో శ్రీకృష్ణుని చరిత్రం ప్రజలు పాడుకోవటానికి మడికి సింగన చేసిన ప్రయత్నం ప్రశంసనీయం.

బలరామకృష్ణులు మధుర ప్రవేశిస్తుండగా పురస్త్రీలు శ్రీకృష్ణుని శౌర్యపరాక్రమాలు ఈ విధంగా కొనియాడినారు.