పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/23

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

29


"ఆకరయుగానలమృగాంకశకవత్సరములై పరగు శార్వరిని బుణ్య
ప్రాకటితమార్గశిరపంచమిని బొల్చు నుడుపాలసుతవాసరమునందున్
శ్రీకరముగా మడికి సింగన తెనుంగున రచించెఁ దగఁ బద్మసుపురాణం
బాకమలమిత్రశిశిరాంశువుగఁ గందసచివాగ్రణికి మంగళమహాశ్రీ"


కర=2, యుగ=4, అనల=3, మృగాంక=1. 'అంకానాం వామతోగతిః' చొప్పున శా. శ. 1342. దీనికి 78 కలిపితే క్రీ. శ. 1420. దీనిని వీరేశలింగం పంతులు మొదలుకొని చాగంటి శేషయ్య ప్రభృతి సాహిత్యచరిత్రకారులు ఆమోదించినారు. కాని మల్లంపల్లి సోమశేఖరశర్మ ప్రభృతులు తిథివారాలు కుదరలేదని నిరాకరించినారు. జూనియర్ వేదం వేంకటరాయశాస్త్రి ఆరుద్ర ప్రభృతులు మల్లంపల్లివారినే బలపరచినారు. కాని నిడుదవోలు వెంకట్రావు ప్రభృతులు పై మంగళమహాశ్రీ వృత్తంలోని 'మార్గశిరపంచమి'ని మాఘసితపంచమిగా సవరించి 8-1-1421 A.D. తేదిగా నిర్ణయించినారు.

ఇంతే కాదు. కాకినాడ ఆంధ్రసాహిత్యపరిషత్తు తాళపత్రప్రతి 1157/16 జ్ఞానవాసిష్ఠరామాయణం 190 తాటాకు చివరనగల మరొక మంగళమహాశ్రీవృత్తం ప్రకటించినారు.

శ్రీకరశశాంకములు సింధురవరామయుతశీతకరమైన పరిధావిన్
ప్రాకటవసంతయుతఫాల్గునమునందు సితపంచదశి కావ్యతిథికావ్య
శ్రీకి నిధి యౌమడికిసింగన తెనుంగున వసిష్ఠరామాకృతి యొనర్చెన్
చేకొని యహోబలము శ్రీనరమృగేంద్రునకు సేమముగ మంగళమహాశ్రీ.

సింధు=4, రవ=5, రామ=3, శీతకర=1=1345+78=1432 A. D. పరీధావి ఫాల్గుణపౌర్ణమి శుక్రవారం అనగా 1-3-1433 A.D. తేదినాటికి వాసిష్ఠరామాయణరచన ముగిసినట్లు తేల్చినారు.