పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/22

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

28

IV సకలనీతిసమ్మతంలో—

క.

సరసకవితావిలాసుఁడ
గురుభారద్వాజరమ్యగోత్రాబ్ధిసుధా
కిర ణాయ్యలార్య తనయుఁడ
హరిదాసుఁడ మడికి సింగయాఖ్యుఁడ ధాత్రిన్.

(I-3)

ఈ పద్యా లాధారంగా మడికి సింగన వంశవృక్షం దేశకాలములు తెలుసుకోవచ్చును. భారద్వాజగోత్రులు ఆపస్తంబసూత్రులలో బ్రహ్మన మంత్రి పుట్టినాడు. అతని కొడుకు గుండన. గుండన భార్య కొమ్మాంబ. ఆ దంపతులకు ఇద్దరు కొడుకులు; అల్లాడమంత్రి గంగనలు. తిక్కన సోమయాజి పౌత్రుడు (పుత్రుడు) గుంటూరు కొమ్మవిభుని కూతురు చిట్టాంబికను అల్లాడమంత్రి వివాహమాడినాడు. కృష్ణా దక్షిణతీరాన రావెల అగ్రహారం పొందినాడు. అక్కడ గోపీనాథునికి ఆలయం కట్టించినాడు. అల్లాడమంత్రి చిట్టాంబికల తనయుడు అయ్యల మంత్రి. ఆయన భార్య పేరయమంత్రి బిడ్డ సింగమ్మ. అయ్యలమంత్రి రాజమహేంద్రవరపాలకుడు తొయ్యేటి అనపోతభూపాలుని ఆస్థానియై గోదావరిఉత్తరతీరాన పెద్దమడికిలో నివాసమైనాడు. సింగమ్మ అయ్యల మంత్రి దంపతులకు అహోబల నరసింహదేవుని వరంతో సింగన అనంతయ్య ఓబయ నారయలు జన్మించినారు. ఈ నలుగురిలో పెద్దవాడైన సింగనయే వలసపోయి రామగిరి పట్టణాధీశుడైన ముప్ప భూపాలుని ఆస్థానకవియై ఆతని మంత్రి వెలిగందల కందనమంత్రికి తన కృతులు అంకితం చేసినాడు. ఆతని గురువులు తిరుమల అయ్యలార్యులు. మడికి సింగన విశిష్టాద్వైతి.

ఇక సింగనకాలం గురించి. పద్మపురాణం కొన్ని తాళపత్రప్రతుల్లో చివరనగల మంగళమహాశ్రీవృత్తంలో చెప్పినతేదీ ప్రకారం పద్మపురాణరచన క్రీ. శ. 1420లో ముగిసినది. ఇది బ్రౌను పాఠముల్లోను ఉన్నది.