పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/17

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

23

కృతిపతి వెలిగందల కందనామాత్యుని ఏలిక రామగిరి పాలకుడైన ముప్పభూపాలుని తండ్రి. గుంటూరు మండలం గురిజాల తెలుంగురాయడు. ఆతని పెద్దభార్య మల్లమ్మ. ఆమెకు ముప్ప భూపాలుడు, ముత్త భూపాలుడు - ఇద్దరు కొడుకులు. తమ్ముడు సహాయకుడుగా ముప్ప భూపాలుడు రామగిరి రాజధానిగా సబ్బినాటిరాష్ట్రాన్ని చక్కగా పాలించినాడు. అతనికి ఇరువెత్తుగండ, గండగోపాల, కాంచిరక్షపాలక, చోడరాజ్యస్థాపనాచార్య, దొంతిమన్నియవిభాళన, చలమర్తిగండ, గజగంధవారణ, రాయగజకేసరి, మూరురాయరగదాళాది బిరుదులున్నవి. తనకు అగ్రహారవృత్తులు కల్పించి, తన కృతిభర్తకు ఆశ్రయదాతయైన ముప్ప భూపాలునికి మడికి సింగన ఒక్క కృతియైనా అంకింతం ఎందు కీయలేదో? సింగన తొలికృతులు మనకు లభించలేదు. అందులో ఏవైనా ముప్ప భూపాలునికి అంకిత మిచ్చినాడో ఏమో? ముప్ప భూపాలుని ప్రసక్తి వర్ణనం తన నాలుగుకృతుల్లోను చేసినాడు సింగన. దానిలో రెండు పద్యాలు -

సీ.

కమఠాహి కోల దిక్కరులరాయిడి మాని
       యీవీరు భుజశక్తి నెసఁగె ధాత్రి
కలి నొక్కపాదమై కదలనేరని ధర్మ
       మీపుణ్యుఁ డూఁతగా నిలఁ జరించె
వెడఁగు రాజులచేత నడఁగిన కీర్తి యీ
       నృపచంద్రు మన్నన నింగి ముట్టెఁ
గర్ణాది నృపులతోఁ గడచన్న దాన మీ
       జగతీశ్వరునిచేత మగుడఁ బుట్టె


అ.

అనుచుఁ బొగడ నేలె నఖిలంబు గురజాల
గోత్రవార్ధి కుముదమిత్రుఁ డన్య
రాజమకుటకలితరత్నరంజితపదాం
బుజుఁడు తెలుగు నృపతి ముప్పవిభుడు.

(పద్మ. I-16)