పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/16

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

22

కృతిపతి వంశావతారము: కాశ్యపగోత్రం వాణసవంశంలో రుద్రసచివుడు జన్మించి మొలగూరు (కరీంనగరానికి 15 మైళ్ళు) పాలకుడైనాడు. ఈతని భార్య అన్నమాంబ. వారి సంతానం గన్నయ, రుద్రయ, పోతయ, మల్లయలు. జ్యేష్ఠుడైన గన్నయ కాకతీయగణపతి చక్రవర్తివద్ద మంత్రిగా ఉండినాడు. గణపేశ్వరునికి గోపికాధిపునికి గుళ్ళు కట్టించి ప్రతిష్ఠలు సేయించినాడు. ఈనా డామందిరాలు శిథిలమైనవి. ప్రక్కలో మసీదు వెలసింది. మొలగూరికి పడమట రుద్రసముద్రమనేపెద్దబావి పశువులకోసం గాడి కల్పించినాడు. ఈతనిభార్య గౌరమ్మ. వారికుమారుడు మల్లన్న. మల్లన్న మొలగూరువాకిట మందిరం కట్టించి రామేశ్వరప్రతిష్ఠ చేసినాడు. ఈనా డామందిరం లేదు. ఈ మల్లన్న భార్యకూడ గౌరమ్మ. వీరికి గణపతి, గోపన, రామన, గన్నయ - నలుగురు కొడుకులు. పెద్దకొడుకు గణపతి భార్య మరల గౌరమ్మ. వారి సంతానం మల్లన, అబ్బయమంత్రి. ఇందులో మధ్యవాడైన అబ్బయకే ఔబళయ్య అని నామాంతరం. ఆయన భార్య పేరుకూడ గౌరమ్మయే. ఆమె కేసనమంత్రి కూతురు. ఈ దంపతుల సంతానం 1. తిమ్మన, 2. కేసన, 3. కందన, 4. మంత్రులు. ఈ నలుగురిలో ద్వితీయ తృతీయులైన కేసన కందన లిద్దరూ రామగిరి ముప్పభూపాలునికి మంత్రులు. కేసన ధర్మపురిలో (కరీంనగరానికి 40 మైళ్ళు) నరసింహస్వామికి అన్నసత్రం పెట్టించి విశేషోత్సవాలు చేయించేవాడు. రామగిరిలో ఒక విష్ణ్వాలయం కట్టించినాడు. దానిపై స్వర్ణకమలం ఎత్తించినాడు. ఈనా డామందిరం లేదు. ఈ కేసన తమ్ముడు కందనమంత్రి. పద్మపురాణం కృతిభర్త. ఈతనికి మల్లమ్మ కాచమ్మ లిద్దరు భార్యలు. కందన యింటిపేరు వెలిగందలవారు (వెలిగందల కరీంనగరానికి 8 మైళ్ళు). కందనమంత్రి "అపూర్వవచనరచనాబంధురకావ్యరసాభిజ్ఞుడు"(-55). అతని కృతి నీతితారావళి నుండి కొన్ని పద్యాలు సింగన తన సకలనీతిసమ్మతంలో చేర్చినాడు. పోతనగారి భాగవతరచనలో పాలుపంచుకొన్న వెలిగందల నారయ కూడ ఈ వంశం వాడేనేమో?