పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/10

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

16

ధిపతి ఏలూరిపాటి అనంతరామయ్య. ఇప్పటికి ఆయన విష్ణు, వామన, వరాహ, మార్కండేయ, బ్రహ్మవైవర్త, కూర్మ, లింగ పురాణాలు ప్రకటించినారు. స్కాందాంతర్గతములైన శివమాహాత్మ్య, విజ్ఞానయోగ, ముక్తి, యజ్ఞవైభవ ఖండాలు అచ్చులో ఉన్నవి. ఇది మన తెలుగుదేశంలో పురాణాలకున్న మన్ననను తెలియజేస్తుంది.

తెలుగు పద్మపురాణం : అష్టాదశ పురాణాలలో రెండవదైన పద్మపురాణం సాత్త్వికపురాణం. శ్లోక సంఖ్య 55 వేలు 626 అధ్యాయాలు. పద్మపురాణంలో ఆది, భూమి, బ్రహ్మ, పాతాళ, సృష్టి, ఉత్తరఖండా లారు. పద్మకల్పవృత్తాంతం చెప్పటంచేత దీనికి పద్మపురాణమని పేరు. దీనిలో శ్రీహరి పారమ్యం ప్రతిపాద్యము. దీనిని మొదట శ్రీహరి బ్రహ్మకు వినిపించినాడు. బ్రహ్మ మరీచ్యాది మునులకు చెప్పినాడు. ఇందులో చైత్రాది 12 మాసాల మాహాత్మ్యం, 26 ఏకాదశుల మహిమ, పితృభక్తి విష్ణుభక్తి మాహాత్మ్యం, భగవద్గీతల మహిమ, రామనామ వైభవం, పంచాఖ్యానము వంటి ప్రశస్తవిషయా లున్నవి. ఏ పురాణంలోను లేని అష్టాదశపురాణాత్మక విష్ణుస్వరూపవర్ణనం ఇందులో ఉన్నది. అందుకే మడికి సింగన పద్మపురాణాన్ని అమృతపయోధితో (I-66) పోల్చి దీని గొప్పతనం సూచించినాడు. కందనమంత్రి మడికి సింగనతో—

గీ.

అవని పద్మంబు ఖండత్రయంబునందు
సర్వసారాంశమై పుణ్యజనక మగుచు
మండితంబైన ఉత్తరఖండమీవు
తెనుఁగు గావింపు నాపేర ననఘచరిత !

I-61

అనటంచేత ఆనాటి పాద్మము ఖండత్రయంలో ఈనాటి ఖండషట్కం ఇమిడి ఉన్నట్లు భావించాలె. పూర్వమధ్యమ ఖండాలలో 408 అధ్యాయా లున్నవి. ఉత్తరఖండం 282 అధ్యాయాలలో సింగన 218 అధ్యాయాలు అనువదించలేదు. ఇవికూడ ఆయన దృష్టిలో పూర్వమధ్యమ ఖండాలే కావచ్చు. సంస్కృతం ఉత్తరఖండం 219 అధ్యాయం మొదలుకొని చివరి 282 అధ్యాయం వరకున్న 64 అధ్యాయాల శ్లోకాలు మాత్రమే సింగన తెనిగించాడు. ఈ 64 అధ్యాయాలలో 5790 శ్లోకా లున్నవి.