పుట:పంచతంత్రి (భానుకవి).pdf/98

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

శూరతయును గపటం బె
వ్వారలకేనియును గలుగు, వారిసమీపం,
బారయ విడిచి రయంబున
దూరస్థానంబు నొందుదురు ధీమంతుల్.

13


వ.

అని పలుక నవ్వాక్యమ్ము లాకర్ణించి, సందీపియాననం బాలోకించి
మన కెయ్యది కర్తవ్యం బని మేఘవర్ణుం డడిగిన, నతం డిట్లనియె,—

14


ఉ.

స్థానము వాయునంత నిజసైన్యసమూహము వాయు, వైరి సం
తానముమీఁది కార్యములు దా నొనరింపఁగ నోపఁ, డాత్మ ర
క్షానిభృతార్థితార్థి యగు గావున, బుద్ధిఁ దలంచి చూచినన్
స్థానబలమ్మె కావలయు ధారుణి, విఠ్ఠయలక్ష్మధీమణీ!

15


గీ.

నెలవు బాసి మున్ను నలహరిశ్చంద్రకౌం
తేయు లంతవారు దీనవృత్తి
నొదిగియుంట వినమె! మదిఁ దలపోసిన
బాయఁదగదు నేల ప్రాజ్ఞులకును.

16


వ.

అనిన విని యతండు ప్రదీపిం గనుంగొని యెయ్యది యాచరింపవల
యుననిన, నతం డిట్లనియె,—

17


చ.

అతిబలవంతుఁడైన విషయమ్మున వారలతోఁడి మైత్రి సం
తతమును నిశ్చలంబగు మనమ్మునఁ జేసి, నిజప్రదేశసం
గతుఁడయి పొల్చు టొప్పు, నది గాదని యొండొకదేశ మేఁగినన్
ధృతిమెయి పోరినన్, వినుము ధీయుత! నొచ్చు నతండు నేరమిన్.

18


వ.

అట్లు గావున వారలతో సామం బాచరించి యిచ్చట నుండుద మనిన,
నవ్వాయసవిభుండు, ఆదీపిం గనుంగొని భవన్మతం బెఱింగింపుమన, నతని కతం
డిట్లనియె,—

19


క.

పరు లొకకాలము చేకొని
పరిమార్చిరి మనబలంబుఁ బ్రస్ఫుటకీర్తిన్
బరిమార్ప మనము నాక్రియఁ
బొరిగొందము, కపటబుద్ధి పొగడిత కెక్కన్.

20