పుట:పంచతంత్రి (భానుకవి).pdf/97

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

ఆతరుశాఖను బలిభు
గ్రాతము సేవింప నొక్కవాయస ముండున్,
జాతి దనుఁ గొల్వ నతిప్ర
ఖ్యాతిగ నుండును దివాంధ మశ్రాంతమ్మున్.

6


వ.

ఇట్లుండి యొకనాఁ డతిక్రోధారుణీకృతలోచనుం డగుచు విమ
తాభిధానుండగు దివాంధవల్లభుండు ఘూకసహస్రపరివృతుండై విభావరీ
సమయంబునఁ బ్రభంజనజవంబునం జనుదెంచి నిద్రావశంబు నొందియున్న
వాయసవిసరంబుపైఁ బడి చరణనఖకమ్ములన్ జంచుపుటమ్ముల భేదింపఁ
దొడంగిన, నందు పరిదేవనారుతమ్ముల గగనమ్మున కెగసియు, నన్యభూజ
మ్ములన్ జేరియు, దిగ్భ్రమం బొందియుఁ, గృతాంతనిలయమ్ము డాసియు,
ని ట్లనేకప్రకారమ్ములఁ బలాయనత్వంబు నందినఁ గాకిమూఁకలకు దొరయగు
మేఘవర్ణుండనువాఁ డప్పుడు,—

7


క.

పరుల కభేద్యంబగు త
త్తరుకోటరమునను డాఁగి తనజీవంబున్
వెరవొంద నిలుపుకొని భా
స్కరోదయమ్మైన శోకసంయుతుఁ డగుచున్.

8


వ.

ఉండు నవసరమ్మున, నతనిమంత్రులు, నుద్దీపి సందీపి ప్రదీప్యాదీపి
చిరంజీవులను నేవురు దివాంధవల్లభుబారికిం దప్పి యొక్కటం గూడికొని
తమయేలిక యగు మేఘవర్ణుం డున్నచోటికిం జని దండప్రణామం బాచరిం
చిన బలిభుగ్వల్లభుం డిట్లనియె,—

9


గీ.

బ్రతికితిరె! మీరు కౌశికప్రతతిచేత
నిట్టియాపద సనుదెంచె నేమి సేయ
వచ్చు, దైవవశంబని వారితోఁడఁ
బలికి చింతావశీకృతభావుఁ డగుచు,—

10


వ.

అయిన నేమి కాఁగలకార్యంబులు కాక మానునె! మన కిప్పుడు
సేయవలయుకృత్యం బెయ్యది యెఱింగింపుఁ డనిన నందు నుద్దీపి యిట్లనియె.

11


క.

తనసదృశుఁడైన సామం
బును, నల్పుండైన దండమును, మత్తుండై
నను భేద, మధికుఁడైనను
బనివడి దానమ్ము సేయఁ బరగు ధరిత్రిన్.

12