పుట:పంచతంత్రి (భానుకవి).pdf/91

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


గీ.

బోయచేతఁ గొనుక భూపతియును దన
పుత్రున కిడె నతఁడు ప్రోది చేసి
నన్ను బెంచి వేడ్క నా[పదములఁ] బైఁడి
యందె లిడియె నాకు నంద మొంద.

85


వ.

నేను భూపతికుమారున కల్లారుముద్దు సేయుచు వేడుకవేళ
వెంటవెంటం దిరుగుచు గంతు లిడుచు పరువులు వారుచు సందుల దూరుచు
బాలుల మీఱుచు నుండియుండి యొక్కనాఁడు బాలుతోఁడం గూడి పురో
పవనమ్మునకుం జని వంగివంగి పచ్చిక మేయుచుండ.

86


ఆ.

బాలుఁడొకఁడు వచ్చి పట్టినన్ గొట్టిన
నిరపరాధి నన్ను నీవు గొట్ట
నేల యనుచు నేను బాలునిఁ దిట్టితి
నలి మనుష్యభాషణముల వేగ.

87


వ.

నే తిర్యక్కనైయుండియు మానవభాషణమ్ములఁ బలికిన పలు
కులు రాజకుమారుం డాలించి,—

88


శా.

నావాక్యమ్ములు మర్త్యభాషణము లైనన్ రాజపుత్రుండు మో
హావేశమ్మును బొంది తేఱి యపు డాద్యంతం బెఱింగించె రా
డ్దేవస్వామి కతండు రేపకడ భూదేవోత్తమశ్రేణిలో
నావృత్తాంత మెఱుంగఁ జెప్పె మదిలో నాశ్చర్య ముప్పొంగఁగన్.

89


గీ.

అమ్మహాత్ములు గ్రహశాంతి యపుడు చేసి
బాలు దీవించి యమ్మహీపాలువలన
ద్రవ్యసంపదఁ బొంది నితాంతసమ్మ
దమున నృపు గాంచి పలికి రాసమయమందు.

90


వ.

దేవా! యిది యొక్కకారణంబున మృగశరీరంబు నొందినది
గాని మృగమ్ముగాదు. దైవభాతి భవన్మందిరంబున నిలుపవలదు. మున్ను
దీనిం గొని తెచ్చిన లుబ్ధకుచేతనే యథాస్థానంబున విడిపింపవలయు నన నభ్భూ
వల్లభుం డ్రాహ్లాదపల్లవితహృదయుండై యట్ల చేయించె నవ్విధంబున—

91