పుట:పంచతంత్రి (భానుకవి).pdf/89

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

కులసతి రోయును జుట్ట
మ్ములు వాయుదు రొరులు కష్టపుంబలుకుల ని
మ్ముల నాడఁదొడఁగుచుందురు
కలియుగమున ద్రవ్యహీనుఁ గరణిక లక్ష్మా!

71


క.

మృతిఁ బొందిన జనునైనను
హితులెల్లను డాయుదురు మహీస్థలిలోనన్
మతిఁ దలఁపఁ బేదఁ జేరరు
బ్రతిమాలిన, నొరులు నూత్న భరతాచార్యా!

72


క.

ఇలలోపల ధీయుతునకు
వలయును దృఢమనము బంధువర్గము పొగడన్
దలపోసి చూడ, లేమియుఁ,
గలిమియు, పోవచ్చు గానఁ గరణిక లక్ష్మా!

73


క.

పామరుల వేడఁజేయును
ధీమద మణఁగించి బుద్ధి తేకువ చెఱుచున్
ప్రేమ[వ]తులఁ [నెడఁ]బాపును
లేమియుఁ గష్టమ్ము సూక్ష్మలిఖితాచార్యా!

74


క.

తలఁప దశవాజిమేధ
మ్ములనైన ఫలమ్ము చలనబుద్ధిరహితుఁడై
చెలిమి యొనరించు, సద్గుణ
కలితుండగు నరునిఁ బొందుఁ గరణిక లక్ష్మా!

75


గీ.

ధనము పోయిన దృఢలక్ష్మిఁ దఱుగనీక
మంచిమనమున సద్ధర్మ మహితపదము
దప్పి నడవక, పరులసంతాప ముడుప
వైద్యుఁడన సంచరింతు భూవలయమందు.

76


వ.

అని యివ్విధంబున నాహిరణ్యకుండను వెలుక నిజకథావృత్తాం
తంబును నీతిప్రకారంబును నెఱింగింప నాకర్ణింపుచున్న జరఠకచ్ఛపేంద్రుం
గనుంగొని లఘుపతనకుం డిట్లనియె.

77