పుట:పంచతంత్రి (భానుకవి).pdf/7

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

లను, ప్రాభవసూచకమగు మలహరీ వాద్యమును, రాజాంతఃపురమున నాట్యవిద్యాధిపత్యగౌరవమును గూడఁ బడసినవాఁడని తెలియుచున్నది.

ప్రభువాల్లభ్యమున సమస్తవైభవములను బడసి పూర్ణకాముఁడైన యీయనఘుఁడు, పూర్వాచార్యమతములనెల్లఁ బరిశీలించి కీర్తిశరీరరక్షణార్థమై యితరసంగీతలక్షణగ్రంథముల వన్నెయు వాసియుఁ దఱుఁగునట్లు సంగీత సూర్యోదయమును నీ మహాగ్రంథమును రచించెనఁట.

ఈ లక్ష్మీనారాయణుఁడు భారద్వాజగోత్రుఁడు, గౌరమాంబా కేశవామాత్యుల పౌత్రుడు. రుక్మిణీ విఠ్ఠలేశ్వరమంత్రుల పుత్రుఁడు. ఈతనిచేత గురువుగాఁ బేక్కొనఁబడిన విష్ణుభట్టారకులను పంచతంత్రప్రస్తావమున, భానుకవి గూడ “నానావిధకళాప్రవీణత దిక్కుల వెలసిన భరతము విష్ణుభట్లు” అని పేర్కొనెను.

సూక్ష్మలిఖితాచార్య, రాయబయకార, తోడరమల్ల, అభినవభరతాచార్య అను నివి లక్ష్మీనారాయణుని బిరుదాంకములు.

పంచతంత్రము

సంస్కృతమున విష్ణుశర్మ బాలశిక్షార్థమై, సకలనీతిశాస్త్రములసారముమద్ధరించి మిత్రభేద, మిత్రలాభ, సంధి విగ్రహ, లబ్ధనాశ, అసంప్రేక్ష్యకారకము లను నైదుతంత్రములతోఁ బంచతంత్రమను గ్రంథమును రచించెను.

"సకలార్థశాస్త్రసారం
జగతి సమాలోక్య విష్ణుశర్మేదం
తంత్రైః పంచభి రేత
చ్చకార సుమనోహరం శాస్త్రం.”

వ్యుత్పత్తిలాభమునకై ప్రథమాభ్యసనియదుగు నొక్క శబ్దశాస్త్రము నభ్యసించుటకే పండ్రెండేళ్లు పట్టును. పిమ్మట, మన్వాది ధర్మశాస్త్రములును, కౌటిలీయాద్యర్థశాస్త్రములుకు, వాత్స్యాయానాది కామశాస్త్రములును నేర్చి