పుట:పంచతంత్రి (భానుకవి).pdf/8

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ననే కాని పురుషార్థవివేకము సిద్ధింపదు. మనుష్యజీవితవ్యవధి యత్యల్పమును, అనిశ్చితమునుగాన చిరకాలపరిశ్రమసాధ్యములగు నీ శాస్త్రములను విడిచి సులభమార్గమునఁ బిన్నలకు సకలనీతిశాస్త్రసారమును దెలిపి, బోధాన్వితులను జేయుటకై విష్ణుశర్మ ఈ నీతిశాస్త్రసంగ్రహమును రచియించెను.

నాఁటినుండి యీ గ్రంథ మొకభారతదేశమునందేకాక, పరదేశభాషలయందుఁ గూడఁ బరివర్తితమై మిగులఁ బ్రయోజనము కలదగుటవలన, బహుళప్రచారము గలదయ్యెను.

ఆంధ్రీకరణపద్ధతులు

తెనుఁగునఁ జంపూరూపమునఁ బరివర్తితములైన పై మూఁడు గ్రంథములయొక్క యాంధ్రీకరణపద్ధతులను, ఒండొంటితోఁ బోల్చి యించుక పరిశీలించుట యిట నప్రస్తుతము కాదు.

క.

కోపప్రసాదగుణములు
భూపాలునియందుఁ దెలిసి బుద్ధి నధికుఁడై
చాపలవిరహితహృదయుం
డై పెంపునఁ గొలువ నధికుఁడగు సేవకుఁడున్.

—భానయ

క.

కోపప్రసాదచిహ్నము
లే పార్థివునందు భృత్యుఁ డెఱిఁగి చరించున్
దీపించి వాఁడు నృపుచే
నేపారఁగ మంతుకెక్కు నెక్కుడు కరుణన్.

—నారాయణకవి

క.

కోపప్రసాదచిత్త
వ్యాపారము లెఱిఁగి కొలిచి వర్తిల్లు భటుల్
భూపాలబాహుశాఖా
రోపితులై యుంద్రు చనవు రొక్కంబవుటన్.

—వేంకటనాథుఁడు