పుట:పంచతంత్రి (భానుకవి).pdf/69

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


నను వాక్యంబు వినంబలికిన, పెద్దలు నాశ్చర్యంబు నొందిరి. ధర్మబుద్ధియు
విషాదమ్ము నొంది భూరుహంబునందు ధర్మం బెద్దియు లేకపోయెనని,
తత్కోటరంబునఁ దృణసంఘం బిడి యనలమ్ము రగిలించె నంత,—

306


చ.

పొగ లెగయంగ నుగ్రత, నభోవలయమ్మున విస్ఫులింగముల్
మిగులఁగ బర్వఁ, గోటరసమేతుఁడు కోమటి యోర్వలేక ము
న్నుగ మహిఁ గూలి చచ్చినఁ గనుంగొని పెద్దలు దుష్టబుద్ధిఁ గ్రో
ధగతి నదల్చి తిట్టి, రిది, తథ్యముగా నెఱిఁగెన్ నృపాలుఁడున్.

307


క.

ఆలోన భూతధాత్రీ
పాలుం డాదుష్టబుద్ధిఁ బటురోషమునన్
శూలమ్మున వేయించె, జ
నాలి యితఁడె ధర్మసూనుఁ డని మదిఁ బొగడన్.

308


వ.

అట్లు గావున, చేసిన దుష్కృతం బెట్టివారికి ననుభవహేతువగు
నని వెండియు దమనకుం జూచి కరటకుం డిట్లనియె.

309


క.

కులము కుపుత్రునిచేతం,
బలి యల్పునిచేత, సాధుభావంబులు చె
ల్వలచేత, సుకృతసంహతి
కలుషంబులచేతఁ బొలియుఁ గాదె! తలంపన్.

310


గీ.

విషధనంజయభీమదర్వీకరముల
పగిది, నీదుచరిత్రమ్ము భయద మనుచు
నున్నయది నాకు, గురుదశ నొందఁజేసి
తమ్మహాత్ముని మృగరాజు, నని యతండు.

311


వ.

వెండియు నిట్లనియె.


ఆ.

ఎలుక లద్భుతముగ నెందేని లోహస
హస్రతతుల మ్రింగె, నంద మిత్రు
వలన వారి చిఱుతవాఁడును డేగచే
నవహరింపఁబడె నటంచుఁ బలుక.

312