పుట:పంచతంత్రి (భానుకవి).pdf/68

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


గీ.

అంత బకపతి తనభార్యయందుఁ గన్న
పిల్లలను బ్రోవవలెనని పెల్లుచింతఁ
దీరమున నున్న, గొలని కుళీరవిభుఁడు
గాంచి, హితుఁ డౌటచేఁ గౌతుకమునఁ బలికె.

299


వ.

బకపతీ! చింతాక్రాంతస్వాంతుండ వగుటకుం గతం బేమి యన
నతండు నిజవృత్తాంతం బంతయు నెఱింగించిన విని యే నొక్కయుపా
యమ్ము చెప్పెద, నొక్కనకులసుషిరమ్ము మొదలుకొని సర్పవల్మీక
పర్యంతమ్మును జలచరమ్ముల నెఱపు మట్లైన నీకు శుభం బగునని చెప్పిన
బకప్రభుండును తద్వచనప్రకారమ్మున నాచరించె నయ్యవసరమున.

300


క.

నకులమ్ము వెడలి మీనప్ర
కరము దిని పాముఁ జంపి భక్షించి మహో
త్సుకతఁ దరు వెక్కి యందలి
బకసంతానమ్ము మ్రింగెఁ బ్రస్ఫుటభంగిన్.

301


వ.

ఇట్లు గావున నుపాయమ్ము క్రియ నపాయమ్ము చింతింపవలయు
ననిన, విని లోభాకీర్ణహృదయుండై దుష్టబుద్ధి బలాత్కారమ్మున నిబిడ
ధ్వాంతాక్రాంతనిశాంతయగు నిశీధవేళం, దరుకోటరమ్మున, నిజజనకు
నిం డాఁచె నంత.

302


చ.

కలువలఁ బాసి తుమ్మెదలు కంజగృహమ్ముల డాయఁ, గుక్కుటం
బులు రొదసేయ, జక్కవలపొందులు మించఁగ, నీడజంబు చె
య్వుల విహరింపఁ, జీఁకటిసమూహ మణంగ, జగజ్జనం బిలా
తలి నలరంగఁ, దారకలదర్పము దప్పఁ బ్రభాత మొప్పినన్.

303


వ.

ఇట్లు వేఁగిన దుష్టబుద్ధియు,—

304


గీ.

అద్దురాత్ముండు పెద్దల నప్పు డటకుఁ
దోడుకొనిపోయి దురితవిదూర! వృక్ష!
యిచటఁ బాఁతినవిత్తంబు నెవ్వఁ డపహ
రించె నెఱిగింపు జనులకుఁ బ్రీతి యెసఁగ.

305


వ.

అని పలుక నావృక్షకోటరమ్ములోనున్న వృద్ధవణిక్కు ప్రజలకు
వినవచ్చునట్లుగా నావృక్షమ్ము పలికినట్ల ధర్మబుద్ధి యిప్పదార్థం బహరించె,