పుట:పంచతంత్రి (భానుకవి).pdf/65

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


సీ.

వలగొని వణఁకుచు వానరు లడవిలో
                    మిణుగురుపురువులు మెఱయఁ గాంచి
నిప్పుకలని డాసి నివ్వెరపడఁ, జూచి
                    పలికె సూచిముఖుండు ప్రజ్ఞ మెఱయ
నగ్గి కాదిది యేటి కలముక యున్న నా
                    రన, నుపలమ్ము చేనంది యొక్క.
క్రోతి తత్పక్షీంద్రుఁ గ్రోధాకృతిని వేయఁ
                    బడె, నట్లు గావునఁ బాపమతికి
బుద్ధి దెలియఁజెప్పఁ బోలడు, జెప్పితిఁ,
గ్రూరశిష్యుచేత గురుఁడు దొల్లి
భంగమొందె, నట్టిపాటు చేకురదు గ
దా! యటచుఁ బలుక దమనకుండు.

284


అ.

అనఘ యెఱుఁగఁ జెప్పు మాకథావృత్తాంత
మనిన నొక్కపురమునందు మున్ను
భిక్షుఁడుండ నతనిఁ బ్రీతిఁ గిరాతుండు
సేవఁజేసె నిష్టసిద్ధికొఱకు.

285


వ.

భిక్షుండును గతిపయదినమ్ములు చనిన నతనిఁ గృపావీక్షణం
బున వీక్షించి మత్పదాంగుష్ఠంబు ప్రతిదినంబును జలంబులం గడిగికొని
త్రావు మట్లైన నీకు నిష్టసిద్ధి యగుననినం, గిరాతుం డవ్విధం బొనరింపు
చుండ,—

286


చ.

అవనిపుఁ డొక్కకార్యమున కంపిన దూరము బోయ సోపోవుచున్,
బ్రవిమలచిత్త! మీచరణపద్మమునందలి వ్రేలినీరు నా
కు, వలె ననారతమ్ము సమకూఱఁగ, మీ రరుదెండటన్న, భి
క్షువరుఁడు వాని యాననముఁ జూచి మదిం గలుషించి యిట్లనున్.

287


వ.

లుబ్ధకా! గురువువెంట్ల శిష్యుండు పోవుఁ గాని, శిష్యునివెంట
గురువు పోవునే! యిది విరుద్ధాచారమ్ము నీవెంట వచ్చుట యన నవివేకంబు,
నాయందలి భక్తియె నీకుఁ గలిగినంజాలు నాపదాంగుష్ఠజలంబు కారణంబు
గాదనిన, నక్కిరాతుండు వెడనవ్వు నవ్వి దేవా! మీ రి ట్లాన తీఁదగునే! సత
తం బాచరింపుచున్నవ్రతం బే నెట్లు విడువనేర్తు, నావెనువెంట నీవు వచ్చినఁ