పుట:పంచతంత్రి (భానుకవి).pdf/62

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


బద్మగర్భాచ్యుతేశాభిధానంబులం దాల్చి నానాజగద్రాజి, కుత్పత్తి రక్షాల
యం బాచరింపంగఁ ద్రైగుణ్యవృత్తిం బ్రవర్తింతు నొక్కొక్కచో మత్స్య
కూర్మాదిరూపమ్ముల న్మించి లోకోపకారమ్ము గావింతు వంభోజగర్భాం
డముల్ రోమకూపమ్ములోనుండ నత్యున్నతస్థూలదేహమ్ముచే నుందు, వే
కార్ణవంబైనవేళన్, వటోద్భూతపత్రమ్ముపై సూక్ష్మగాత్రమ్మునన్ శైశవ
క్రీడ నర్తింతు వింద్రావనీభృత్ఫణీంద్రాకృతిన్ నాకభూనాగలోకమ్ములన్
లీలఁ బాలింతు వాకాశతేజోనిలాంభోవనీపంచభూతాత్మకత్వంబునన్
సర్వభూతాళి కాధారమై యుందు, వీరేడులోకంబులం గూర్మశీర్షంబు
విఖ్యాతి [నం]తర్బహిర్వృత్తిఁ దేలింతు వభ్రచ్యుతాంభోలవంబంబు
పూరంబునుం జెంది పాథోనిధానంబులం జెందుచందమ్మునన్ సర్వతేజోవి
శేషంబులెల్లన్ భవద్విగ్రహంబంద డిందున్ గజేంద్రాదిసద్భక్తరక్షార్థమై
తావకస్ఫీతబాహాచతుష్కంబునన్ జక్రశార్ఙాసిశంఖమ్ము లేపారుచుండన్
ద్వదీయాంఘ్రికంజాతమందాకినీనిర్మలోదంబు లశ్రాంతమున్ గ్రూరపాపోరు
పంకమ్ములం బాపు నీమాయ, గీర్వాణముఖ్యాఖిలప్రాణిసంఘాతవారాశికిన్
వేలయైయుండు నంభోజభూసంభవానందకారీ! మురారీ! భుజంగేంద్ర
తల్పా! సుధాకల్ప! వందారుకల్పా! నమస్తే నమస్తే నమస్తే నమః॥

268


చ.

అని వినుతించినం గరుణ నంబుజనాభుఁడు [వానితోఁడ]
హనమవు కేతనంబ వరయన్ బ్రియభక్తుఁడ వీవు నాకు నీ
మనముననున్న కోర్కు లనుమానము మానుమెఱుంగఁ జెప్పుమ
న్నను, ముదితాంతరంగుఁడయి నాథునితోఁ బ్రియమొప్ప నిట్లనున్.

269


వ.

దేవా! మత్కులసంభవుండగు టిట్టిభవరునండమ్ముల మహో
ద్రేకమ్మున సముద్రుండు నిష్కారణంబునఁ గైకొన్నవాఁడ నిన నాభగవం
తుండు పర్జన్యు నాననం బాలోకించిన నతండు జగన్నాథునాజ్ఞం జేసి నదీ
వల్లభుం గోపించిన జలాంతర్గతంబగు నండమ్ములు దెచ్చి పర్జన్యుని కిచ్చె
నతండు భగవంతుని సమ్ముఖమునం బెట్టిన నాసర్వేశ్వరుండు వినతాసుతున
కిచ్చె, నాపక్షిపతి టిట్టిభున కొప్పించె, నతండును పుత్రకళత్రమ్ములఁ గూడి
కొని విరోధివర్గంబు మట్టుపెట్టి సుఖంబుండె. నట్లు గావున శత్రువిక్రమం
బెఱింగియు వైరంబు దగదనిన విని సంజీవకుండు దమనకుం జూచి మృగ
ధూర్తా! మృగేంద్రుం డెవ్విధంబున నున్న సమరోద్యోగి యని తెలియ
వచ్చు ననిన నతం డిట్లనియె.

270