పుట:పంచతంత్రి (భానుకవి).pdf/61

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


చితగతిఁ జన, నతిగర్విత
మనస్కుఁడై యాభవిష్యమతి యున్నంతన్.

263


వ.

పట్టుకొను నవసరంబున నుత్పన్నమతి చిలుపచిలుప నీరునంబడి
ప్రవాహంబున నొండొకహ్రదమ్ము జేరె నప్పుడు జాలరు లరుగుదెంచి
"యద్భవిష్యతిఁ" బట్టుకొని పదిలంబుగా జాలమ్ములం దిడి లగుడంబున
మృతిబొందించిరి. అట్లు గావున, ననాగతబుద్ధి యోచింపవలయునని టిట్టిభ
ప్రభుండు వనితకుఁ జెప్పి యూరకుండె నంత.

264


క.

టిట్టిభవిభుఁ డొనరించిన
యట్టి కులాయమ్ములోన ననువున నుండన్,
బెట్టున ముంచె సముద్రుం
డెట్టిదొకో దీనిమహిమ యెఱిఁగెద మనుచున్.

265


ఉ.

టిట్టిభి యంత నేడ్చినఁ గడింది మగంటిమి నాతఁ డిట్లనున్
వట్టివిలాప మంద, సతి! వల్దిది నేఁ గొనివత్తు నండముల్
గట్టిగనంచు నండజనికాయము గూడుక వైనతేయు న
ప్పట్టున గొల్చి మ్రొక్కి తనపా టెఱిఁగించి నుతించె భక్తితోన్.

266


వ.

ఇట్లు టిట్టిభమ్ము సుపర్ణు నుతియించిన నతం డతనిభక్తికి మెచ్చి
టిట్టిభావ్యండజంబుల ముందిడుకొని పుండరీకాక్షుసన్నిధికిం జని దండ
ప్రణామంబు లాచరించి నిటలతటఘటితకరకమలపుటుండై యిట్లని
స్తుతియించె.

267


దండకము.

శ్రీ మత్కృపావీక్ష! రక్షోమదాంభోధి[1]మంథాన
యోగీంద్రచిత్తాంబుజాసక్తరోలంబ! జంభారిముఖ్యామకస్తోమమౌళి
స్ఫురద్రత్నకాంతిచ్ఛటాక్రాంతపాదాబ్జ! దుగ్ధాబ్ధికన్యాకుచద్వంద్వకస్తూరికా
వాసితోరస్స్థలప్రాంత! నే నెంతవాఁడన్ భవన్మూర్తి వర్ణింప, నాస్వర్ణగర్భా
దులున్.....అంభోఘటౌఘంబులన్ జంద్రసూర్యాభ్రముల్ పెక్కులై
తోఁచుచందమ్మునన్ లోకలోకాంతరాళమ్ములన్ జీవరూపత్వముం బొంది
తత్కర్మబీజంబునన్ బద్మపత్రాంతరస్థాంబుబిందుస్వభావంబునన్, గూడి
యుం, గూడ వాకారశూన్యత్వ మొప్పన్ బరంజ్యోతివై యుండియున్

  1. మంచార