పుట:పంచతంత్రి (భానుకవి).pdf/56

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


జాలవు కదలుమనిన నది యొదిగినిలిచె, వ్యాఘ్రం బేతెంచి నన్ను నాహా
రంబు గొనుమనిన నీవు నా కర్ధాహారంబు చాలదనిన నది కడకుంబోయె,
నిట్లు మువ్వురు దొలంగినం జూచి యుష్ట్రవిభుండు నిర్భయహృదయుండై
యిట్లనియె.

231


శా.

బాహుళ్యక్షుథ నొంద నేమిటికి న న్బక్షింపుమన్నంత, ను
త్సాహం బొప్పగఁ గాకజంబుకతరక్షమ్ముల్ మహోపాయశౌ
ర్యాహంకారము లొప్పఁ జంపిన మృగేంద్రాధీశ్వరుం డంతలో
నాహారం బొనరించె వాని నది యట్లయ్యెన్ విచారించినన్.

232


వ.

అని దమనకుండు సెప్పిన సంజీవకుండు విని యిట్లనియె.

233


గీ.

కలదు ము న్నొక్కగిరి మహాగహనమందు
దానిశృంగమ్ము నిరువది తాఁటిచెట్ల
పొడవు గల దందుపై వటభూరుహంబు
పొలుచు ఫలముల సాంద్రసంపూర్ణముగను.

234


వ.

అట్టి భూజమ్మునందు.

235


గీ.

కలఁడు కాండోద్భవుండను కాకవిభుఁడు
వేలపర్యంతములు కాకవితతి గొలువ
నందు గూడుల నమరిచి యఖిలతరుల
ఫలములను దిని సుఖితమై బ్రతుకుచుండ.

236


వ.

అం దొక్కనాఁడు సముద్రతీరమ్మున వసియించు చక్రియను వృద్ధ
హంస తనపరిజనమ్ములం దానును విలాసార్థంబుగా సకలభూములం
గ్రుమ్మఱి తననివాసమ్మునకుం జనుచో నడుమను దనభటుల నెడఁబాసి
యేకాకియై యెందేనియుం దిరిగి తిరిగి పథంబుగానక ప్రొద్దు వ్రాలుటయుం
జూచి దిక్కు లేక, కాండోద్భవుండను కాకప్రభుండున్న వటమహీజంబుఁ
జేరిన.

237


క.

అందుల కాకులు దమకుల
మందముగాఁ గాకయున్న నలిగి కఠోరం
బంద జగడంబు చేసినఁ
బొందుగఁ గాకప్రభుండు పొండని మాన్పెన్.

238