పుట:పంచతంత్రి (భానుకవి).pdf/50

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ఉ.

నీకుఁ బ్రియమ్ము గూర్చి బహునీతులు కార్యపథమ్ము దెల్పినన్
జేకొనవైతి విట్లు విధిచేఁ జెడువారల కేల బుద్ధి, శౌ
ర్యాకరుఁడైన గోవిభుని యద్భుతకైతవశక్తి మెచ్చి, దీ
నాకృతి నాహితంబు హృదయంబున నిల్పెదవన్న, నావుడున్.

189


వ.

పెద్దయుంబ్రొద్దు చింతించి సంజీవకు గుణావగుణంబు లెఱింగెద
నతని నిచ్చటికిం దోడ్కొని రమ్మనిన నతం డట్లేని బలవంతుండు నీచెప్పినట్ల
వినునే! మంత్రభిన్నమ్ము గాకుండ నరిం బొరిగొనవలయు నీవు దలంచిన
మహోద్యోగమ్ములు జన్మాంతరఫలప్రాప్తియునుంబోలె నిడుదలై యున్న
యవిగాన సన్నిహితకార్యంబులు గావు నొరులకపటత్వం బూహ నెఱుంగ
వలయు ననిన, నమ్మృగేంద్రుండు తోఁకఁద్రొక్కిన భుజంగమ్ము చందంబున
మండిపడి యహంకారపూర్వకంబగు వాక్యంబున నిట్లనియె.

190


క.

తలపోయ నుగ్రవిక్రమ
కలితుఁడ న న్నేమి సేయఁగలడని, తనతోఁ
బలుకక యుండిన దమనకుఁ
డలరుచునుం బలికె వేడ్క నాతనితోఁడన్.

191


వ.

ఎవ్వండేని గృహమ్మునం దననడవడి యెఱుంగనివానికిఁ బ్రతి
శ్రీ నొసంగిన డిండిభంబు పట్ల దోషంబున మందవిసర్పిణి యను చీరపేనుం
బోలె దండధరునిలయంబునకుం బోవు ననిన విని మృగేంద్రుం డాకథ
యెఱింగింపుమనిన దమనకుం డిట్లనియె.

192


గీ.

అనఘ ము న్నొక్కరాజు శయ్యాతలంబు
నందు మందవిసర్పిణి యనఁగ వస్త్ర
యూక యుండంగ డిండిభాఖ్యుండు మత్కు
ణాధిపతి వాయువశమున నచట పడిన.

193


గీ.

వానిఁ బొడగని ప్రీతితో వస్త్రయూక
యతిథిసత్కారపూజల నాదరించి
యేఁగుదెంచిన కార్యమ్ము నెఱుఁగఁ జెప్పు
మనిన నాతండు వాని కిట్లనుచుఁ జెప్పె.

194