పుట:పంచతంత్రి (భానుకవి).pdf/39

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

హీనాధికబలములు నీ
మానసమునఁ దలఁపవలదు మైత్రి ఘటింతున్
నానేర్పుచేత నన విని
గోనాథుం డాత్మలోనఁ గోర్కులు నిగుడన్.

116


గీ.

అట్లు గావించి నన్ను నెయ్యమునఁ బ్రోవు
మనిన దమనకుఁ డతని వీడ్కొని కుతూహ
లంబు పెంపార, వడిఁ బింగళంబు కడకు
నరిగి ప్రియమున వందనం బాచరించి.

117


వ.

[నిలిచిన] పింగళకుం డతనిం బ్రియపూర్వకంబులగు వాక్యంబుల
నాదరించి పోయివచ్చిన కార్యం బెఱింగింపుమనిన దమనకుం డిట్లనియె.

118


సీ.

సమవర్తి వక్త్రదంష్ట్రాభీషణములగు
                    దీర్ఘవిషాణముల్ తేజరిల్ల
ధరణిఁ జరించు గోత్రగావమో యన
                    ననుదైన సింహసంహనన మొప్పఁ
బాయని మేచకాభ్రముభాతి నెంతయు
                    రమణీయమగు మూపురమ్ము దనరఁ
బ్రళయావసన[రుద్ర]పటహానినాదంబు
                    లంకురించిన మాడ్కి ఱంకె లమరఁ


గీ.

బ్రకటగాంభీర్యధైర్యదర్పప్రతాప
గుణములఁ దనర్చు నొకవృషగణవరేణ్యుఁ
గంటి నాతఁడు నన్నును గారవించె
[నధిపు మన్ననగల] బంట నగుటఁ జేసి.

119


వ.

అని చెప్పిన విని యిట్టి బలపరాక్రమసంపన్నునికడ కెట్లు వోయితని
యడిగినఁ దద్విధం బెఱింగించెదనని యతం డిట్లనియె.

120


మ.

ఘనబాహాబలసంపదుజ్జ్వలుఁడు దీర్ఘక్రోథుఁడై వీరయో
ధనికాయమ్ములఁ గూల్చు నల్పజనులన్ ధాత్రీస్థలిన్ నిల్పు నె
ట్లనినన్ గాఢజవప్రభంజనుఁడు ఘోరారణ్యసాలమ్ములన్
గినుకన్ గూల్చి తృణమ్ములన్ నిలుపుమాడ్కిన్ లక్ష్మమంత్రీశ్వరా!

121